గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అడ్వైజరీ కమిటీ

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అడ్వైజరీ కమిటీ
  • చైర్మన్​గా బీఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్​గా మంద భీంరెడ్డి 
  • సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం

హైదరాబాద్, వెలుగు: గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు అడ్వైజరీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల కాలపరిమితి గల ఈ కమిటీకి.. చైర్మన్ గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డాక్టర్ బీఎం.వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డిని నియమించారు. 

జీఏడీ ప్రొటోకాల్, ఎన్నారై విభాగానికి చెందిన జాయింట్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారి.. కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ను నియమించారు. 

గల్ఫ్ వలసలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగిన ప్రవాసీ కార్మిక నాయకులు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, డాక్టర్ లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాస రావు, కొట్టాల సత్యంనారా గౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్లను సభ్యులుగా నియమించారు. నిరుడు ఏప్రిల్ 16న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాజ్ దక్కన్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అన్నీ స్టడీ చేసి నివేదిక ఇవ్వనున్న కమిటీ

గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ వలస కార్మికుల సంక్షేమాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికుల కోసం అమలవుతున్న స్కీమ్​లపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రవాసీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలు కనుగొనేందుకు ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా... సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పనతో పాటు, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ తదితర దేశాల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.