
హైకోర్టులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో వేణుగోపాల్ రావు అనే న్యాయవాది మరణం మరువక ముందే.. మరో న్యాయవాది కోర్టు ఆవరణలో కుప్పకూలి మరణించారు. బుధవారం ( ఫిబ్రవరి 19, 2025 ) సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో చోటు చేసుకుంది ఈ ఘటన. వెంకటరమణ అనే న్యాయవాది సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో కుప్పకూలాడు.. దీన్ని గమనించిన తోటి న్యాయవాదులు అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తరలించే లోపే వెంకటరమణ మృతి చెందినట్లు తెలుస్తోంది. అప్పటి దాకా తమతో యాక్టివ్ గా ఉన్న తోటి న్యాయవాది ఉన్నట్టుండి కుప్పకూలడంతో కోర్టులోని వారంతో నిర్ఘాంతపోయారు.
వెంకటరమణ మృతికి గల కారణాలు వంటి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.రెండురోజుల వ్యవధిలోనే వరుసగా ఇద్దరు న్యాయవాదులు హఠాన్మరణం చెందడం చర్చనీయాంశం అయ్యింది.. మంగళవారం ( ఫిబ్రవరి 18 ) హైకోర్టులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.. కోర్టులో వాదనలు వినిపిస్తూ వేణుగోపాల్ రావు అనే న్యాయవాది గుండెపోటుతో మృతి చెందారు.
21వ కోర్టు హాలులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేట్ పసునూరు వేణుగోపాలరావు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని అంబులెన్స్‌లో పక్కనే ఉన్న ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే, డాక్టర్లు పరీక్షించి అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.
అప్పటివరకు తమతో ఉన్న అడ్వకేట్ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందడంతో కోర్టులోని వారంతా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే కోర్టులో కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి కేసుల విచారణను ముగించి బెంచ్ దిగివెళ్లిపోయారు. అడ్వకేట్ ఆకస్మిక మరణ వార్త తెలియగానే ఇతర కోర్టులు కూడా అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశాయి.