ఫార్ములా– ఈ రేస్​లో కేటీఆర్​ది ఏకపక్ష నిర్ణయం

ఫార్ములా– ఈ రేస్​లో కేటీఆర్​ది ఏకపక్ష నిర్ణయం
  • ఫార్ములా– ఈ రేస్​లో కేటీఆర్​ది ఏకపక్ష నిర్ణయం 
  • హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్​ జనరల్ వాదన
  •  అవినీతి జరిగిందనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి
  • నిధులు ఎక్కడికి చేరాయో.. ఎవరికి ముట్టాయో తేల్చాలి
  • దర్యాప్తు దశలో అడ్డుకోవడం కరెక్ట్​ కాదు
  • గంపగుత్తగా చట్టాల ఉల్లంఘన:  దాన కిశోర్​ తరఫు న్యాయవాది
  • కక్షసాధింపులో భాగంగా 14 నెలల తర్వాత కేసు: కేటీఆర్ ​తరఫు లాయర్
  • కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్​
  • తీర్పు వచ్చేదాకా కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా– ఈ రేస్​లో మాజీ మంత్రి కేటీఆర్​ది ఏకపక్ష నిర్ణయమని ప్రభుత్వం తరఫు న్యాయవాది అడ్వొకేట్​ జనరల్​ సుదర్శన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందనేదానికి ఆధారాలున్నాయని వెల్లడించారు.  ఫార్ములా–-ఈ రేస్​ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌  దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రభుత్వం, ఫిర్యాదుదారు దాన కిశోర్​, పిటిషనర్​ కేటీఆర్​ తరఫున లాయర్లు వాద, ప్రతివాదనలు వినిపించారు. కాగా,  తీర్పును  న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ రిజర్వ్​ చేశారు. తీర్పు వెల్లడించే దాకా పిటిషనర్‌ కేటీఆర్‌ను అరెస్ట్​ చేయొద్దని ఏసీబీని ఆదేశించారు. గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లోని నిబంధనలన్నీ అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఏసీబీ దర్యాప్తును కొనసాగించవచ్చని,  దర్యాప్తునకు కేటీఆర్‌ సహకరించాలని, ఆయన వద్ద ఉన్న పత్రాలను ఏసీబీకి అందజేయాలని ఆదేశించారు. 

తీవ్రంగా పరిగణించాలి: ఏజీ సుదర్శన్‌రెడ్డి

ఫార్ములా –ఈ రేస్‌కు సంబంధించి 2023లో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందే చెల్లింపులు జరిగాయని ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదించారు. ఒప్పందాలు జరుగుతాయని ఊహించి చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోర్టును కోరారు. అవినీతి జరిగిందని ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. ఫస్ట్‌ అగ్రిమెంట్‌ 2022 అక్టోబరు 15న జరగ్గా.. 2023 అక్టోబరు 27న రద్దయిందని తెలిపారు. ఆ తర్వాత 2023 అక్టోబర్‌ 30న రెండో ఒప్పందం జరిగిందని వెల్లడించారు. రెండో ఒప్పందానికి ముందే హెచ్‌ఎండీఏ డబ్బులు చెల్లించడాన్ని బట్టి అవినీతి, అక్రమాలు జరిగాయని అర్థమవుతున్నదని,  అవినీతికి ఇదే ప్రాథమిక ఆధారంగా పరిగణించొచ్చని చెప్పారు. రెండో ఒప్పందాని కంటే ముందే అంటే 2023 అక్టోబర్‌ 3, 11వ తేదీల్లో  రెండు విడతలుగా రూ.54.88 కోట్లు హెచ్‌ఎండీఏ సాధారణ నిధుల నుంచి చెల్లించేసిందని చెప్పారు. 

మున్సిపల్‌‌‌‌‌‌‌‌ మంత్రి ఆధీనంలోనే హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ ఉంటుందని, ఆనాడు మున్సిపల్‌‌‌‌‌‌‌‌ మంత్రిగా పిటిషనర్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఉన్నారని, పిటిషనర్‌‌‌‌‌‌‌‌ చెప్పిన కారణంగా ఆర్థిక శాఖ అనుమతి కూడా లేకుండా నగదు చెల్లింపులు చేశారని వివరించారు. మంత్రిగా ఉన్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆమోదంతోనే హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ చెల్లించిందని, చట్ట ప్రకారం రూ.10 కోట్లకు మించి చెల్లింపులు జరపాలంటే ప్రభుత్వం నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ అనుమతులు పొంది తీరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత మొత్తం చెల్లించాలంటే ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నిబంధనలను గాలికి వదిలేసి చెల్లింపులు చేసేలా పిటిషనర్‌‌‌‌‌‌‌‌ మంత్రి హోదాలో అధికారులకు ఆదేశాలను జారీ చేశారని వాదించారు.

రిజర్వ్​బ్యాంకు అనుమతి లేకుండా చెల్లింపులు

రిజర్వ్​ బ్యాంకు అనుమతి లేకుండా ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​ (ఐఓబీ) ద్వారా నేరుగా విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లింపులు కూడా చట్ట వ్యతిరేకమని ఏజీ సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. విదేశీ సంస్థకు నగదు చెల్లించిన ఫలితంగా ఇన్‌‌‌‌‌‌‌‌కంట్యాక్స్‌‌‌‌‌‌‌‌ కింద రూ.14  కోట్లు అదనపు భారం పడిందని చెప్పారు. ఫార్ములా– ఈ రేసింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనమేమీ లేదని, స్పాన్సరర్‌‌‌‌‌‌‌‌కే లాభాలు వచ్చాయని చెప్పారు. నిందితుల జాబితాలో ఫార్ములా –ఈ సంస్థను ఎందుకు చేర్చలేదని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నించడం ద్వారా కేసు నుంచి ఏదో విధంగా తప్పించుకునే తపన కనబడుతున్నదని అన్నారు.

Also Read :- గుడ్ న్యూస్.. సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు

  ఫార్ములా– ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు చెందినదని, అన్ని అంశాలను పరిశీలించాకే కేసు నమోదు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని, ఈ క్రమంలోనే ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదులో జాప్యం జరిగిందని తెలిపారు.  దర్యాప్తులో తేలిన సమాచారం ఆధారంగా కొత్తగా నిందితులను చేర్చడం, అవసరమైతే ఉన్న వాళ్లను తొలగింపునకు వీలుంటుందని చెప్పారు. రాజకీయ, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలతో కేసు నమోదు చేశామనే వాదనలో పస లేదని చెప్పారు. అధికారుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీ ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసిందనే వాదనను ఏజీ తోసిపుచ్చారు. ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిగిందని, అక్టోబర్​ 18న దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిందని వెల్లడించారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌పై విచారణ చేపట్టేందుకు డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 17న గవర్నర్‌‌‌‌‌‌‌‌ నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ కూడా పొందినట్లు చెప్పారు. కేసు ప్రాథమిక దర్యాప్తు కూడా ప్రారంభించకుండానే కేసును క్వాష్‌‌‌‌‌‌‌‌ చేయాలని పిటిషన్​ వేయడానికి వీల్లేదని, ఈ మేరకు సుప్రీం కోర్టు పలు తీర్పులు చెప్పిందని గుర్తు చేశారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు  కేసును కొట్టివేయాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ కోరడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేసుకోవాలని అన్నారు.

అవినీతి కేసు సరికాదు: కేటీఆర్​ తరఫు న్యాయవాది 

తొలుత పిటిషనర్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ తరఫును సుప్రీంకోర్టు సీనియర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది సిద్ధార్థ దవే వాదిస్తూ, కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫార్ములా –ఈ  రేస్‌‌‌‌‌‌‌‌ నిమిత్తం ప్రభుత్వం, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈవో), ఏస్‌‌‌‌‌‌‌‌ నెక్స్‌‌‌‌‌‌‌‌జెన్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. సీజన్‌‌‌‌‌‌‌‌ 9 సమర్థవంతంగా నిర్వహించాక 10వ సీజన్‌‌‌‌‌‌‌‌కు ప్రమోటర్‌‌‌‌‌‌‌‌ వెళ్లిపోవడంతో ప్రభుత్వమే చెల్లింపులు జరిపి రేస్‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు ఆమోదం తెలిపిందని చెప్పారు. 2023కు చెందిన బకాయిలు చెల్లించిందని తెలిపారు. కొత్త ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అర్బిట్రేషన్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ఉన్న ఒప్పందం అమల్లో భాగంగానే రెండో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ జరిగిందని, ఈ నేపథ్యంలో అది ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉండగా చేసుకున్నామనే వాదన సరికాదని పేర్కొన్నారు. నిజంగానే ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘన జరిగితే ఆ విషయాన్ని ఎన్నికల సంఘం చూసుకుంటుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని వాదించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా కేసు నమోదు చేశారని తెలిపారు. 

కేసు నమోదు 14 నెలల ఆలస్యంగా చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సుప్రీంకోర్టు లలిత కుమారి, చరణ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ కేసుల్లో ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా తీవ్ర జాప్యంతో కేసు నమోదు అయిందని వెల్లడించారు. సుప్రీం కోర్టు 3 నెలల జాప్యానికే అంగీకారం చెప్పలేదని ఉదహరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌‌‌‌‌‌‌‌ 13(1)(ఏ) కింద కేసు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు 41 ఏ నోటీసులు జారీ చేయకుండా ఉండేందుకే ఐపీసీ 409, 405, పీసీ యాక్ట్‌‌‌‌‌‌‌‌ 13(1)(ఏ) వంటి సెక్షన్లను పిటిషనర్‌‌‌‌‌‌‌‌పై పెట్టారన్నారు. నిధుల చెల్లింపులు, అంతకుముందు అగ్రిమెంట్ల డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌  అన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని, నిధులు పొందిన వాళ్లను వదిలేసి పైసా కూడా తీసుకోని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ను నిందితుడిగా చేర్చడం రాజకీయ కుట్రేనని అన్నారు. నిధులను పిటిషనర్‌‌‌‌‌‌‌‌ సొంతానికి వినియోగించుకోలేదని చెప్పారు. ప్రమోటర్‌‌‌‌‌‌‌‌ నిందితుడిగా లేనప్పుడు ఐపీసీ 120 బీ కింద కుట్ర జరిగిందనే అభియోగాన్ని ఎలా మోపుతారని ప్రశ్నించారు. గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ పాలసీలో భాగంగా తీసుకున్నదని, విధాన నిర్ణయంలో లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవాల్సింది ప్రభుత్వమేగానీ.. నాటి మంత్రిగా తీసుకున్న నిర్ణయంతో పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు బాధ్యత ఉండదని వాదించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకు పిటిషనర్‌‌‌‌‌‌‌‌పై కఠిన చర్యలు తీసుకోవడం లేదా అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకోరాదని ఏసీబీని ఆదేశించింది. 

గంపగుత్తగా చట్టాల ఉల్లంఘన: సీనియర్​ న్యాయవాది సీవీ మోహన్​రెడ్డి

ఈ కేసులో ఫిర్యాదుదారుడైన మున్సిపల్‌‌‌‌‌‌‌‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్‌‌‌‌‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది సీవీ మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదనలు వినిపించారు. రెండో ఒప్పందం చేసుకోడానికి ముందే రెండు విడతల్లో నగదు చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. విదేశీ కరెన్సీ చెల్లింపుల నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారు. చట్టాలను గుంపగుత్తగా ఉల్లంఘించారన్నారు. నిధులు ఎవరికి చెల్లించారు? చెల్లించామని చెబుతున్న నిధులు ఆ సంస్థకు వెళ్లాయా? అక్కడి నుంచి ఆ నిధులు వేరే వాళ్లకు మళ్లింపు జరిగిందా? అవినీతి ఎక్కడ జరిగింది? పిటిషనర్‌‌‌‌‌‌‌‌కే తిరిగి నిధులు చేరాయా? వంటి అంశాలన్నీ దర్యాప్తులో తేలుతుందని అన్నారు. ఈ దశలో పిటిషనర్‌‌‌‌‌‌‌‌ వినతులను ఆమోదించవద్దని కోరారు.