వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన అడ్వకేట్‌‌.. హైకోర్టులో గుండెపోటుతో మృతి

వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన అడ్వకేట్‌‌.. హైకోర్టులో గుండెపోటుతో మృతి

హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. 21వ కోర్టు హాలులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేట్‌‌ పసునూరు వేణుగోపాలరావు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని అంబులెన్స్‌‌లో పక్కనే ఉన్న ఉస్మానియా హాస్పిటల్‌‌కు తరలించారు. అయితే, డాక్టర్లు పరీక్షించి అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. 

అప్పటివరకు తమతో ఉన్న అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందడంతో కోర్టులోని వారంతా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే కోర్టులో కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి కేసుల విచారణను ముగించి బెంచ్‌‌‌‌‌‌‌‌ దిగివెళ్లిపోయారు. అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ ఆకస్మిక మరణ వార్త తెలియగానే ఇతర కోర్టులు కూడా అత్యవసర పిటిషన్లు, పాస్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ పిటిషన్లను విచారించి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ పిటిషన్లను వాయిదా వేశాయి.