సీబీఐ ఎఫ్ఐఆర్లో తన పేరులేదన్న కారణంతో ఎమ్మెల్యే కవిత విచారణకు హాజరుకానని చెప్పడం సరికాదని అడ్వొకేట్ రచనా రెడ్డి అన్నారు. ఎఫ్ఐఆర్ లో పేరులేదని విచారణకు రాననడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అసలు కవిత ఎవరి సలహా మేరకు సీబీఐకు లేఖ రాశారో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సీబీఐ కవితకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిందని, ఆ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చేందుకు ఎఫ్ఐఆర్లో పేరు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. నేరానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారిని సెక్షన్ 160 కింద ప్రశ్నించే అవకాశముందని రచనా రెడ్డి చెప్పారు. సీబీఐ ఎమ్మెల్సీ కవితను సాక్షిగా విచారణకు పిలిచిందే తప్ప ఎఫ్ఐఆర్ లో పేరుందని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
సీఆర్పీసీ 160 కింద నోటీసు జారీ చేసినప్పుడు కచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుందని రచనా రెడ్డి చెప్పారు. విచారణ అనంతరం ఆమె పేరును నిందితుల జాబితాలో చేర్చాలా వద్ద అన్న నిర్ణయం సీబీఐ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ ఎఫ్ఐఆర్లో కవిత పేరుంటే 160 బదులుగా 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చే వారిని అన్నారు. నిందితులు, అనుమానితులకు మాత్రమే 41ఏ నోటీసులు ఇస్తారని చెప్పారు. నోటీసులు అందుకున్న వారు ఒకసారి విచారణకు గైర్హాజరైతే మరోసారి అవకాశమిస్తారని, అప్పుడు కూడా రాకపోతే సీబీఐ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని రచనా రెడ్డి స్పష్టం చేశారు.