
- ప్రముఖ అడ్వకేట్ రామారావు ఇమ్మనేని
- చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్గాంధీ ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ అడ్వకేట్ రామారావు ఇమ్మనేని తెలిపారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. షేషెంట్లు, వారి సహాయకులు, డాక్టర్లు, సిబ్బందిని కాపాడాలని కోరుతూ నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది నుంచి లిఫ్టులు సరిగా పనిచేయడం లేదని, ఎనిమిది ఫ్లోర్లు మెట్ల మీద నుంచే డాక్టర్లు, పేషెంట్లు, నర్సులు, సిబ్బంది కిందకు, మీదకు ఎక్కుతున్నారని చెప్పారు.
దీంతో దివ్యాంగులకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. తాగునీరు, ఇతర అవసరాలకు ఒకటే నల్లా నుంచి నీరు అందిస్తున్నారని వివరించారు. వంటగదుల్లో పురుగులు తిరుగుతున్నాయని వెల్లడించారు. ఆసుపత్రిలోని ప్రధాన సమస్యలు, దుస్థితిపై తక్షణమే విచారణ జరపాలని కోరారు. దీనిపై సమీక్ష జరిపి చర్యలు తీసుకునేలా రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. గాంధీలో దారుణమైన పరిస్థితులున్నప్పటికీ ఏడాది నుంచి ప్రభుత్వానికి నివేదించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి పాలన యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని కోరారు.