డీజీపీ ఆఫీసును ముట్టడించిన అడ్వకేట్లు

డీజీపీ ఆఫీసును ముట్టడించిన అడ్వకేట్లు
  • మాదన్నపేటలో అడ్వకేట్​పై దాడిని ఖండిస్తూ నిరసన

బషీర్ బాగ్/ఇబ్రహీంపట్నం, వెలుగు : మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ అడ్వకేట్​ను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని అడ్వకేట్లు మండిపడ్డారు. ఈ ఘటనను నిరసిస్తూ గురువారం లక్డీకాపూల్​లోని డీజీపీ ఆఫీసును ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్​చేశారు. పోలీసులు డీజీపీని కలిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్​మాట్లాడుతూ.. 

నాంపల్లి కోర్టులో అడ్వకేట్​గా పనిచేస్తున్న ఎంఏ ఖలీమ్ మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు వ్యతిరేకంగా స్టే పిటిషన్​వేశాడానే కారణంతో పోలీసులు కొట్టారని ఆరోపించారు. దాడిచేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మాదన్నపేట ఘటనను నిరసిస్తూ ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరెడ్ల అంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్వకేట్లు గురువారం విధులు బహిష్కరించారు. కోర్టు బయట నిరసన తెలిపారు.