హనుమకొండ సిటీ, వెలుగు: అడ్వకేట్‌పై దాడిచేసిన హనుమకొండ ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం అడ్వకేట్లు ధర్నా చేశారు. వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల పిలుపుమేరకు అదాలత్ గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్ మాట్లాడుతూ వరంగల్ బార్ అసోసియేషన్ సభ్యుడైన అడ్వకేట్ గంధం శివ పై ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి ఈనెల 3న రాత్రి కేయూసీ చౌరస్తా సమీపంలో దాడికి పాల్పడ్డాడని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా రిసిప్ట్ ఇచ్చి, కేసు నమోదు చేయలేదన్నారు.
పీఎస్‌లో దురుసుగా ప్రవర్తించి, కేసు పెట్టకపోవడంతో నిరసనకు దిగినట్లు చెప్పారు. సీఐపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల నాయకులు, అడ్వకేట్లు పాల్గొన్నారు.