హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌ను ఏసీబీ కస్టడీకి అప్పగించింది కోర్టు. నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ బుధవారం న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నిఖేష్ కుమార్‌ను ఏసీబీ అధికారులు గురువారం (డిసెంబర్ 12) కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా, హైదరాబాద్‌లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పని చేస్తోన్న నిఖేష్ కుమార్ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డిసెంబర్ 1వ తేదీన నిఖేష్ కుమార్ ఇంటితో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లలో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా కళ్ల బైర్లు కమ్మే రీతిలో ఏసీబీ అధికారులు ఆస్తులు గుర్తించారు. నిఖేష్ కుమార్ దాదాపు రూ.200 కోట్ల విలువ చేస్తే ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి నిఖేష్ కుమార్ నుండి మరిన్నీ వివరాలు రాబట్టాలని.. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
ALSO READ | Manchu family: ఇంకోసారి రచ్చ చేయొద్దు..మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్
పోలీసు అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం 4 రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు ఒప్పుకుంది. నిఖేష్ ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు ఆక్రమ ఆస్తులపై దర్యాప్తు చేయనున్నారు. కాగా, గండిపేట బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేశారని నిఖేష్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. నిఖేష్ పేరిట మూడు ఫామ్‌హౌస్‌లు, మూడు విల్లాలు.. మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ప్లాట్లతో పాటు .. మియాపూర్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నిఖేష్ సస్పెన్షన్‌లో ఉన్నారు.