మొరాయిస్తున్న ట్యాబ్​లు క్రాప్​ సర్వే స్లో

మొరాయిస్తున్న ట్యాబ్​లు క్రాప్​ సర్వే స్లో
  • ఫొటోలు అప్ లోడ్ కావట్లే  కొనసాగుతున్న డిజిటల్ సర్వే 
  •  ఒక్కో ఏఈవోకు 1800 నుంచి 2 వేల ఎకరాల్లో సర్వే టార్గెట్
  •  వరి కోతల ప్రారంభం నాటికి పూర్తి చేయాలని ఆర్డర్స్

యాదాద్రి, వెలుగు : అవాంతరాలు.. ఏఈవోల అసంతృప్తి.. నడుమ నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభమైంది. సర్వే కోసం వాడుతున్న పాత ట్యాబ్​ మొరాయిస్తున్నాయి. దీంతో సర్వే స్లోగా సాగుతోంది. పంటల సాగును పక్కాగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'డిజిటల్ క్రాప్ సర్వే' చేపట్టడానికి రెండేండ్ల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సహా కొన్ని రాష్ట్రాల్లో ఈ సర్వే కొనసాగింది. గతేడాది సెప్టెంబర్​లో ప్రారంభంకావాల్సిన ఈ సర్వే ఏఈవోల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు సహాయ నిరాకరణ చేస్తామని అప్పట్లో తేల్చి చెప్పారు. యాప్ డౌన్​లోడ్ చేసుకోని ఏఈవోలకు అబ్సెంట్ కూడా వేశారు. హయ్యర్ ఆఫీసర్లకు, ఏఈవోల అసోసియేషన్​కు మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ..  చివరకు సర్వే చేపట్టలేదు. 

1,67,088 ఎకరాల్లో సర్వే..

డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో మూడు రోజుల క్రితం ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో 92 క్లస్టర్లు ఉండగా ఈ యాసంగి సీజన్​లో 2,75,316 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. మరో 2,800 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 1,67,088 ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో 92 మంది ఏఈవోల్లో 87 మందికి సర్వే బాధ్యతలు అప్పగించారు. ఏఈవోలు మగవాళ్లయితే 2 వేల ఎకరాలు, మహిళలు అయితే 1800 ఎకరాలు సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ సర్వేతోపాటు రెగ్యులర్​గా చేసే క్రాప్ బుకింగ్ మరో మూడు వేల ఎకరాల పంటల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ప్రతి సర్వే నంబర్ వద్దకు వెళ్లాల్సిందే..

ఏఈవోలు డిపార్ట్​మెంట్ సమకూర్చిన ట్యాబ్స్ తో సర్వే చేయడానికి రంగంలోకి దిగారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లలో యాప్ ఇన్​స్టాల్​చేసుకున్నారు. ఈ యాప్​లోనే క్లస్టర్ పరిధిలోని ఏఏ సర్వే నంబర్లలో సర్వే చేయాలో వివరాలున్నాయి. అయితే ప్రతి సర్వే నంబర్​తోపాటు సబ్ సర్వే నంబర్ వద్దకు ఏఈవోలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి సర్వే నంబర్స్​లో 25 మీటర్లకు మించి దూరం ఉంటే వివరాలు చూపించడం లేదు. దీంతో ఏ ఒక్క సర్వే నంబర్ సమాచారం లేకున్నా అప్లోడ్ కాదు. ప్రతి సర్వే నంబర్ వద్దకు ఏఈవోలు వెళ్తున్నారు. 

సిగ్నల్​ ఉండడం లేదు..

డిపార్ట్​మెంట్ సమకూర్చిన ట్యాబ్​లు ఏడేండ్ల కిత్రం నాటివి కావడంతో అవి మొరాయిస్తున్నాయి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్​ నెట్​ సిగ్నల్ సరిగా రావడం లేదు. ఫొటోలు కూడా క్లారిటీ రావడం లేదు. కొన్ని చోట్ల సర్వే నంబర్ల వారీగా చూపించే కడస్ట్రల్​మ్యాప్స్​(Cadstral Maps) కూడా ట్యాబ్లులో కన్పించడం లేదు. దీంతో  ఏఈవోలు తమ స్మార్ట్ ఫోన్లలో డీసీఎస్ యాప్​ను ఇన్​స్టాల్ చేసుకుంటున్నారు. అయితే ఈ యాప్ ఇన్​స్టాల్​చేసుకోగానే.. ఫోన్లు కూడా కొంత మొరాయిస్తున్నాయి. సర్వే కూడా స్లోగా జరుగుతోంది. వరి కోతలు మొదలు కాకముందే సర్వే పూర్తి చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు డెడ్​లైన్ విధించారు. పాత ట్యాబ్లు సరిగా పని చేయకపోవడం, స్మార్ట్ ఫోన్లు కూడా స్లో కావడంతో ఇప్పటివరకు 18 వేల ఎకరాలకుపైగా సర్వే చేశారు. ఈ లెక్కన కోతలు స్టార్ట్ చేయడానికి ముందే సర్వే పూర్తి చేయడం సాధ్యం కాదని ఏఈవోలు అంటున్నారు.