- మంత్రి తుమ్మలకు ఏఈవోల వినతి
హైదరాబాద్, వెలుగు: సీనియారిటీ ప్రకారమే ప్రమోషన్లు కల్పించాలని ఏఈవోలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. బుధవారం ఏఈవోలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి ఫీల్డ్ లెవల్ లోని సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖలో పెండింగ్ లో ఉన్న ఏఈవోల ప్రమోషన్ల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అమలులో నిబంధనలకు లోబడి సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని మంత్రిని కోరారు. దీనికి మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారు.
ఏఈవోలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పథకాలను రైతుల వద్దకు తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్, ఏఈవో ప్రతినిధులు జగదీశ్వర్,రామకృష్ణ రెడ్డి, సురేష్, వెంకన్న, వెంకటేష్, నరసింగరావు, వసంత, విజయ భారతి రెడ్డి, రాజు వివిధ జిల్లాల ఏఈవోలు పాల్గొన్నారు.