భూ పరిహారం ఇచ్చేదెప్పుడు?.. రెండేళ్లుగా రైతుల ఎదురు చూపులు

భూ పరిహారం ఇచ్చేదెప్పుడు?.. రెండేళ్లుగా రైతుల  ఎదురు చూపులు
  • మల్లన్న సాగర్ నుంచి తపాసుపల్లికి కాల్వ నిర్మాణం
  • బాధితుల ఆందోళనలతో ఆగిన కాల్వ పనులు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి కొమురవెల్లి మండలం తపాసుపల్లి రిజర్వాయర్ కు నీటి తరలింపు కాల్వ కోసం సేకరించిన భూములకు పరిహారం ఎప్పుడు ఇస్తారోనని  బాధిత రైతులు ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేండ్లుగా రైతులను అధికారులు చుట్టూ తిప్పుకుంటుండటంతో వారంతా ఆందోళన బాట పట్టారు. దీంతో కొంత కాలంగా కాల్వ పనులు 
నిలిచిపోయాయి. 

జరిగింది ఇదీ.. 

పది కిలో మాటర్ల మేర సాగే  ఈ  కాల్వ నిర్మాణం కోసం కుకునూరుపల్లి  మండలం లకుడారం, మేథినిపూర్, కొనాయిపల్లి, మంగోల్, కొమురవెల్లి మండలం తపాసుపల్లి గ్రామాలకు చెందిన150 మంది రైతుల నుంచి 178 ఎకరాలను అధికారులు సేకరించారు. ఓపెన్ కెనాల్ కోసం సేకరించిన భూమికి  ఎకరాకు  16.50 లక్షలు పైప్ లేన్ వేసిన చోట ప్రత్యేక పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో పనులు ప్రారంభించేందుకు రైతులు అంగీకరించారు. దాదాపు రెండేళ్ల కింద పనులు ప్రారంభమైనా ఇంత వరకు ఒక్క రైతుకు కూడా పరిహారం అందకపోవడంతో ఇటీవల రైతులు ఆందోళనలకు దిగారు. దీంతో కాల్వ పనులు ఆగాయి. తమకు న్యాయం చేయాలని ఇటీవల వారు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. 

1.24  లక్షల ఎకరాలకు సాగునీరు

సిద్దిపేట, జనగామ జిల్లాల పరిధిలో  1.24  లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించడం కోసం ఈ  కాల్వను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొమురవెల్లి మండలంలో  0.3 టీఎంసీల సామర్థ్యంతో తపాసుపల్లి రిజర్వాయర్ ను నిర్మించగా దీనికి వరంగల్ జిల్లా ధర్మసాగర్ నుంచి దేవాదుల ప్రాజక్టు నుంచి నీటిని ఎత్తి పోస్తున్నారు.   400 మీటర్ల ఎత్తున నీటిని ఎత్తిపోయాల్సి రావడం వల్ల ఖర్చు ఎక్కువవుతుందని మల్లన్నసాగర్ నుంచి తపాసుపల్లికి కాల్వ తవ్వి నీటిని తరలించాలని ప్లాన్​ చేశారు. 

దాదాపు 10.5  కిలోమీటర్ల కాల్వ నిర్మాణంలో 6  కిలో మీటర్లు పైప్ లైన్ 4.5కిలో మీటర్లు  ఓపెన్ కెనాల్ ను నిర్మిస్తున్నారు. వంద మీటర్ల వెడల్పుతో ఓపెన్ కెనాల్స్ నిర్మించి గ్రావిటీ ద్వారా మల్లన్న సాగర్ నుంచి  నీటిని తక్కువ ఖర్చుతో  తపాసుపల్లి రిజర్వాయర్ కు తరలించనున్నారు.  ఇందు కోసం కుకునూరుపల్లి మండలం మంగోల్ లో 51, మేథినిపూర్ 49, కొనాయిపల్లి లో  28  లకుడారం 20   కొమురవెల్లి మండలం తపాసుపల్లి లో 30 ఎకరాలతో కలిపి మొత్తం 178 ఎకరాలు రైతుల నుంచి  సేకరించారు.  

చెల్లింపులో డిలే.. 

కాల్వ నిర్మాణానికి విలువైన భూములను ఇవ్వమని తొలుత రైతులు అభ్యంతరం పెట్టినా అధికారులు మంచి పరిహారం ఇస్తామని ఒప్పించి వారితో సంతకాలు చేయించారు. ఆ తర్వాత రేపు, మాపు అంటున్నారే తప్ప డబ్బులు మాత్రం ఇవ్వకుండా డిలే చేస్తున్నారు. కుకునూరుపల్లి  మండలంలో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న మూడు గ్రామాల పరిధిలో ఎక్కువగా  భూసేకరణ చేశారు. ఇక్కడ ఎకరం భూమి కోటి రూపాయలు పలుకుతున్నా నీల్లొస్తాయని అధికారులు ఇస్తామన్న పరిహారాన్ని తీసుకోవడానికి ఒప్పుకున్నామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు త్వరగా నిర్ణయం తీసుకోని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 

త్వరగా చెల్లించాలి 

మల్లన్న సాగర్ నుంచి తపస్​పల్లి రిజర్వాయర్లకు వచ్చే కాల్వకు నాది 33 గుంటల భూమి పోయింది. పనులు ప్రారంభం కాగానే పరిహారం ఇప్పిస్తమని చెప్పిన్రు.. కానీ రెండ్లు కావస్తున్నా ఇంకా ఇస్తలేరు. సారోళ్లు ఎవరూ పట్టించుకోవట్లే. పరిహారం ఇయ్యకుంటే.. భూమికి భూమి అయినా ఇయ్యాలె. 

 కంకణాల ఉప్పలయ్య, రైతు, తపాసుపల్లి

ప్రతిపాదనలు పంపాం

మల్లన్న సాగర్ నుంచి తపాసుపల్లి రిజర్వాయర్ వరకు కాల్వ నిర్మాణం కోసం సేకరించిన భూ పరిహారం చెల్లింపులో డిలే జరగుతున్నది వాస్తవమే. కానీ పరిహారం  కోసం ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే రైతులకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. 

మల్లికార్జున్, తహసీల్దారు, కుకునూరుపల్లి