నెలరోజుల క్రితం ఓ సంగీత విభావరిలో పాల్గొన్న ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell).. తప్పతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. స్నేహితులతో కలిసి అతిగా మద్యం తాగిన అతడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్నేహితులు అతన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం స్పృహ రాగానే మెల్లగా జారుకున్నాడు. ఈ చర్యలు అప్పట్లో తీవ్ర వివాదస్పదమయ్యాయి. సహచరులు, ఆ జట్టు మాజీలే అతనిపై విమర్శలు చేశారు.
ఎవరు తీసుకునే నిర్ణయాలకు వారే బాధ్యులు. ఇదేమీ క్రికెట్ సంబంధిత విషయం కాదు. ఏం జరిగిందో మ్యాక్సీనే సమాధానం చెప్పాలని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొనగా.. కథ అంబులెన్స్ వరకు వెళ్లిందంటే అర్థం చేసుకోవాలి. ఇలాంటి సంఘటనలు సముచితం కాదు. క్రికెట్ ఆస్ట్రేలియా దీన్ని సీరీయస్‌గా తీసుకోవాలి.. అని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. ఇన్నాళ్లు దీనిపై మౌనం వహించిన మ్యాక్సీ.. ఎట్టకేలకు నోరు విప్పాడు. తన చేష్టలు తనకంటే తన కుటుంబసభ్యులను ఎంతో బాధించినట్లు తెలిపాడు.
"బహుశా అది నాపై చూపిన ప్రభావం కంటే.. నా కుటుంబాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది. నాకు ఆ వారం సెలవు ఉందని తెలుసు. ఆ వారం ఆటకు దూరంగా ఉన్నానని తెలుసు. సమయానికి జట్టుతో కలిశాను.. శిక్షణ మొదలుపెట్టాను.. మున్ముందు అప్రమత్తంగా ఉంటాను.. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో సహాయపడ్డారు. మద్దతు ఇచ్చినందుకు ఆల్ రౌండర్ మెక్‌డొనాల్డ్, సెలెక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు.." అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు.
కాగా, ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ వీరవిహారం చేశాడు. కరేబియన్లపై విరుచుకుపడ్డాడు. 50 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా 55 బంతులాడిన మ్యాక్సీ.. 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో అతనికిది ఐదో సెంచరీ. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలతో రోహిత్ శర్మతో సమానంగా నిలిచాడు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ ఖాతాలోనూ ఐదు శతకాలున్నాయి.
మ్యాక్స్‌వెల్ టీ20 సెంచరీలు
- శ్రీలంకపై 145 నాటౌట్(2016)
- ఇంగ్లండ్‌పై 103 నాటౌట్(2018)
- ఇండియాపై 113 నాటౌట్(2019)
- ఇండియాపై 104 నాటౌట్(2023)
- వెస్టిండీస్‌పై 120 నాటౌట్(2024)
Most Hundreds in T20I:
— Johns. (@CricCrazyJohns) February 11, 2024
Glenn Maxwell - 5* (94 innings)
Rohit Sharma - 5 (143 innings) pic.twitter.com/38HMakhBJL