- అమ్మగలిగే ఆస్తులను విక్రయించి క్యాపెక్స్ పెంచడం బెటర్
- వ్యవసాయ రంగం కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అవసరం : అసోచామ్
న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడం, వినియోగాన్ని పెంచడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వ ఫోకస్ ఉంటుందని పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించే అసోచామ్, ప్రిమస్‌తో కలిసి విడుదల చేసిన పేపర్‌లో పేర్కొంది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ మరింతగా వృద్ధి చెందడానికి బడ్జెట్‌లో సపోర్ట్ దొరుకుతుందని అభిప్రాయపడింది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి యూనియన్ బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశ పెట్టనున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం 3.0 అధికారంలోకి వచ్చాక ప్రవేశ పెడుతున్న మొదటి బడ్జెట్ ఇది.
2047 నాటికి ఇండియా డెవలప్ అయిన దేశంగా మార్చడానికి కేంద్ర బ్లూప్రింట్ రెడీ చేయనుందని అసోచామ్ పేర్కొంది. ఈ గోల్ చేరుకోవడానికి ఏయే అంశాలపై ఫోకస్ పెట్టాలో వివరించింది. ‘వినియోగం పెంచడం, ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడం, ఎకానమీలో సప్లయ్ మెరుగుపరచడం వంటి వెంటనే తీసుకోవాల్సిన చర్యలు బడ్జెట్‌లో ఉంటాయి. అలానే ప్రజల ఆదాయాలు పెరగడానికి రోడ్ మ్యాప్‌ను కూడా ప్రభుత్వం రెడీ చేస్తుందని అంచనా వేస్తున్నాం’ అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ అన్నారు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను పెంచడానికి ఆర్థిక పరంగా ఇబ్బందులు తక్కువగా ఉన్నాయని
కానీ ప్రభుత్వం అమ్మగలిగే ఆస్తులను అమ్మి క్యాపెక్స్ పెంచడం బెటర్ అని ఆయన సలహా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ రధ చక్రాలు గ్రీన్ ఫ్యూయల్‌తో నడవనున్నాయని అసోచామ్ –ప్రిమస్ పేపర్ వ్యాఖ్యానించింది. పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాల నుంచి సోలార్, విండ్ వంటి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఇండియా షిప్ట్ అవుతోందని పేర్కొంది.
జాబ్స్ పెరగడానికి తయారీపై దృష్టి పెట్టాలి
ప్రజల ఇండ్ల అవసరాలను తీర్చేందుకు రానున్న బడ్జెట్‌లో ప్రధాన మంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) 2.0 ను కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని అసోచామ్ ప్రిమస్ పేపర్ అంచనా వేసింది. అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్‌షిప్ (ఏహెచ్‌పీ), బెనిఫిసరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ (బీఎల్‌సీ) వంటి కాన్సెప్ట్‌లను ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలిపింది. ప్రిమస్ పేపర్ ప్రకారం, వినియోగం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇండియన్ కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ చేతిలో ఎక్కువ డబ్బులు మిగిలేలా చర్యలు ఉంటాయని భావిస్తున్నాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ మెరుగుపరిచేందుకు, ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించేందుకు పాలసీలను ప్రభుత్వం ప్రకటిస్తుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగాలను క్రియేట్ చేయాలంటే ప్రభుత్వం తన ప్రయారిటీని వ్యవసాయ రంగం నుంచి తయారీ రంగానికి మార్చాల్సిన అవసరం ఉందని ప్రిమస్ పార్టనర్స్ సీఈఓ నిలయ వర్మ అన్నారు. ‘ఇంజనీరింగ్ బేస్డ్ తయారీ కంపెనీలకు సపోర్ట్ ఇవ్వాలి. చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈల) ను బలోపేతం చేసేందుకు క్లస్టర్లు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఉన్న కస్టర్లకు సపోర్ట్ ఇవ్వాలి. ఈవీ, ఎలక్ట్రానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ వంటి సెక్టార్ల కోసం కొత్తగా క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించుకుంటునే ఈ చర్యలు తీసుకోవాలి’ అని వర్మ వివరించారు.
వ్యవసాయ రంగంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అసోచామ్–ప్రిమస్ పేపర్ పేర్కొంది. కోల్డ్ స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ ఫెసిలిటీలను ఏర్పాటు చేయాలని, పంట కోతలో నష్టాలు రాకుండా చూసుకోవాలని, రైతుల పంటలకు మెరుగైన ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవాలంటే రానున్న పదేళ్లలో వ్యవసాయ రంగంలో సస్టయినబుల్ విధానాలను ఫాలో కావాలని పేర్కొంది. అలా అయితేనే 2070 నాటికి నెట్ జీరో కార్బన్ దేశంగా మారుతామని తెలిపింది.