రెండ్రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు సరిహద్దు ప్రాంతంలోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ జరిపిన దాడుల్లో 46 మంది పౌరులు మరణించారని తాలిబన్ ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన తాలిబన్లు అన్నంత పనిచేశారు.
శనివారం ఉదయం ఆఫ్ఘన్ తాలిబన్ దళాలు ఎగువ కుర్రం జిల్లాలో గల పలు పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఒక పాకిస్తాన్ పారామిలటరీ సైనికుడి మరణించాడు. ఘోజ్‌గఢి, కోట్ రాఘా, మాతా సంగర్, తారీ మెంగల్ ప్రాంతాల్లోని పోస్ట్‌లపై ఆఫ్ఘన్ తాలిబన్ బలగాలు కాల్పులు జరిపినట్లు పాక్ సైన్యం తెలిపింది. దాడుల్లో తాలిబన్లు తేలికపాటి భారీ ఆయుధాలు ఉపయోగించాయని పేర్కొంది.
సరిహద్దుకు సమీపంలో ఉన్న తమ ఔట్‌పోస్టులపై తాలిబన్లు భారీ ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్ మిలటరీ నివేదించింది. ఈ దాడులు ఇస్లామాబాద్, తాలిబాన్ల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. పొరుగు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూనే ఉన్నాయి.