ఆఫ్ఘనిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత అతను 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి వైదొలగనున్నాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ధ్రువీకరించారు.
"నబీ తప్పుకోనున్నాడని వస్తున్న వార్తలు నిజమే. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాక అతను వన్డేల నుంచి వైదొలగనున్నాడు. కొన్ని నెలల ముందే ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చాడు. మేం తన నిర్ణయాన్ని స్వాగతించాం. జట్టులోకి వస్తున్న యువ క్రికెటర్లు పట్ల అతను సంతోషం వ్యక్తం చేశాడు. యువ క్రికెటర్ల చేతిలో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ భవిష్యత్ బాగుంటుందని నమ్మాడు. అతను వన్డేలకు ముంగింపు పలికినా, టీ20 ఫార్మాట్లో కొనసాగుతాడని ఆశిస్తున్నాం.." అని ఏసీబీ చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ALSO READ : Windies Cricket: వెస్టిండీస్ పేసర్‌పై రెండు మ్యాచుల నిషేధం
రెండు నెలలు ఆగితే.. 40 ఏళ్లు
ప్రస్తుతం నబీ వయస్సు.. 39 ఏళ్లు. 1985 జనవరి ఒకటో తారీఖున జన్మించిన ఈ ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ మరో రెండు నెలల్లో 40వ వసంతంలోకి ఆడగు పెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో తప్పుకోవాలని అతను తీసుకున్న నిర్ణయం సమ్మతించదగినదే. అందునా, యువ క్రికెటర్లు ఒక్కొక్కరిగా ఆఫ్ఘన్ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. 2009లో అఫ్గాన్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన నబీ 165 వన్డేల్లో 3,549 పరుగులు చేయడంతో పాటు 171 వికెట్లు పడగొట్టాడు.
అరుదైన రికార్డు
ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్న నబీ.. అత్యధిక వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. బంగ్లా ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌ను వెనక్కినెట్టి నబీ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. అప్పటికీ ఈఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ వయసు 39 ఏళ్ల 43 రోజులు.