- 7 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌కు చెక్
- హష్మతుల్లా, రహ్మత్ షా హాఫ్ సెంచరీలు
- మూడు వికెట్లతో మెరిసిన నబీ
లక్నో: వరల్డ్ క్రికెట్‌లో పసికూనే అయినా.. వరల్డ్ కప్‌లో మాత్రం అఫ్గానిస్తాన్ అదరహో అనిపిస్తోంది. ఇప్పటికే మేటి జట్లను వణికించిన అఫ్గాన్ మరోసారి ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. మెగా ఈవెంట్‌లో సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో కెప్టెన్ హష్మతుల్లా షాహిది (64 బాల్స్‌లో 6 ఫోర్లతో 56 నాటౌట్), రహ్మత్ షా (54 బాల్స్‌లో 8 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ గెలిచిన డచ్ టీమ్ 46.3 ఓవర్లలో 179 రన్స్‌కు ఆలౌటైంది. సైబ్రండ్ (86 బాల్స్‌లో 6 ఫోర్లతో 58), మ్యాక్స్ ఒడౌడ్ (40 బాల్స్‌లో 9 ఫోర్లతో 42), అకెర్‌మన్ (29) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత అఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 181/3 స్కోరు చేసి గెలిచింది. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (31 నాటౌట్) రాణించాడు. మహ్మద్ నబీ (3/28)కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్పిన్నర్లదే జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు మెరుగైన ఆరంభం దక్కినా.. మిడిలార్డర్ ఘోరంగా తేలిపోయింది. అఫ్గాన్ స్పిన్నర్లు మహ్మద్ నబీ (3/28), నూర్ అహ్మద్ (2/31), ముజీబ్ (1/40), రషీద్ ఖాన్ టర్నింగ్‌ను ఎదుర్కోలేకపోయారు. దీనికి తోడు వికెట్ల మధ్య పరుగెత్తడంలో సమన్వయం లేకపోవడంతో నలుగురు రనౌట్‌గా వెనుదిరిగారు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కు వెస్లీ బరేసి (1) ఔటైనా.. మ్యాక్స్, అకెర్‌మన్ నిలకడగా ఆడారు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబడుతూ రెండో వికెట్‌కు 64 బాల్స్‌లో 70 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చారు. 12వ ఓవర్‌లో మ్యాక్స్ రనౌట్ కావడం నెదర్లాండ్స్ కొంప ముంచింది. ఓ ఎండ్‌లో సైబ్రండ్ నిలకడగా ఆడినా.. మిడిలార్డర్ ఫెయిలైంది. మూడో వికెట్‌కు 19 రన్స్ జోడించి అకెర్‌మన్, తర్వాత వచ్చిన స్కాట్ ఎడ్వర్డ్స్ (0) రనౌటయ్యారు. డి లీడె (3), జుల్ఫికర్ (3), వాన్ బీక్ (2) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 74 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన సైబ్రండ్.. 35వ ఓవర్‌లో అనూహ్యంగా రనౌట్ కావడంతో డచ్ 152/8తో కష్టాల్లో పడింది. లోయర్ ఆర్డర్‌లో వాన్ డెర్ మెర్వె (11), అర్యన్ దత్ (10 నాటౌట్)తో పాటు పాల్ వాన్ మీకెరెన్ (4) నిరాశపర్చడంతో డచ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
ఈజీగా ఛేదన..
చిన్న టార్గెట్‌ను అఫ్గాన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించింది. ఆరంభంలో డచ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (20) నెమ్మదిగా ఆడారు. ఆరో ఓవర్‌లో గుర్బాజ్ ఔటయ్యాడు. దీంతో 27/1 వద్ద వచ్చిన రహ్మత్ షా డచ్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. రెండో వికెట్‌కు 28 రన్స్ జత చేసి11వ ఓవర్‌లో ఇబ్రహీం వెనుదిరిగాడు. దీంతో స్కోరు 55/2గా మారింది. ఈ దశలో హష్మతుల్లా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రహ్మత్ షాతో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. . షాతో మూడో వికెట్‌కు 74 రన్స్ జత చేసిన షాహిది.. ఒమర్‌జాయ్‌తో నాలుగో వికెట్‌కు 52 రన్స్ జోడించి అఫ్గాన్‌కు ఈజీ విజయాన్ని అందించాడు. రహ్మత్ షా 47, షాహిది 59 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. వాన్ బీక్, మెర్వె, జుల్ఫికర్ తలో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
నెదర్లాండ్స్: 46.3 ఓవర్లలో 179 (సైబ్రండ్ 58, మ్యాక్స్ 42, మహ్మద్ నబీ 3/28, నూర్ అహ్మద్ 2/31). అఫ్గానిస్తాన్: 31.3 ఓవర్లలో 181/3 (హష్మతుల్లా షాహిది 56*, రహ్మత్ షా 52, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 31*, జుల్ఫికర్ 1/25).