వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనాల పరంపర కొనసాగుతూనే ఉంది. టోర్నీ ప్రారంభంలో తొలి రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఈ జట్టు ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ కు బిగ్ షాక్ ఇచ్చింది. అయితే ఈ విజయం గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ పాకిస్థాన్ పై మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తాజాగా శ్రీలంకపై ఈజీ విక్టరీ కొట్టి వరల్డ్ కప్ సెమీస్ ఆశలు ఇంకా అలాగే ఉంచుకుంది.
పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గాన్ కు ఆదిలోనే తొలి షాక్ తగిలింది. తొలి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ గర్భాజ్ డకౌట్ అయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తో రహ్మతుల్లా షా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో వికెట్ కు 73 పరుగులు చేసిన తర్వాత 39 పరుగులు చేసి జద్రాన్ ఔటయ్యాడు. అప్పటికీ క్రీజ్ లో పాతుకుపోయిన రహ్మత్ షా కెప్టెన్ షాహిద్ తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
132 పరుగుల వద్ద 62 పరుగుల చేసి రహమత్ షా ఔటైనా.. కెప్టెన్ షాహిద్ తో కలిసి ఓమర్జాయ్ మరో వికెట్ పడకుండా ఆఫ్ఘనిస్తాన్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. షాహిద్ 58 పరుగులు చేస్తే.. ఒమర్జాయి 73 పరుగులు చేసాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు తీసుకోగా.. రజితకు ఒక వికెట్ లభించింది. ఈ పరాజయంతో శ్రీలంక దాదాపు టోర్నీ నుండి నిష్క్రమించిందనే చెప్పాలి.
ఇక మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లు ఆడకుండానే 241 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోగా.. అందరూ తలో చేయి వేసి జట్టుకు డీసెంట్ టోటల్ అందించారు. ఓపెనర్ నిస్సంక 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కుశాల్ మెండిస్(39), సుధీర సమర విక్రమే(36), తీక్షణ(29) పర్వాలేదనిపించారు. అసలంక 22 పరుగులు, సీనియర్ బ్యాటర్ మ్యాథూస్ 23 పరుగులు చేసినా వాటిని భారీ స్కోర్లు గా మలచడంలో విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ ఫరూఖీ 4 వికెట్లు తీసుకోగా.. ముజీబ్ కు రెండు వికెట్లు దక్కాయి. రషీద్ ఖాన్, ఓమర్జాయ్ కు తలో వికెట్ లభించింది.