
ఛాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం (ఫిబ్రవరి 28) కీలక సమరం జరగబోతుంది. గ్రూప్ బి లో ఆస్ట్రేలియాతో ఆఫ్ఘనిస్తాన్ తలపడుతుంది. సెమీస్ కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు గెలుపు తప్పనిసరి. లాహోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఆఫ్ఘన్ల చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే చివరి మ్యాచ్ లో సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ చేతిలో భారీ తేడాతో ఓడిపోవాలని కోరుకోవాలి. దాదాపు 120 పరుగుల తేడాతో సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్ లో ఓడిపోవాలి.
సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికా అంత భారీ తేడాతో ఓడిపోవడం దాదాపు అసాధ్యం. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహిదీ విలేఖరులతో మాట్లాడాడు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు మ్యాక్స్ వెల్ కోసం ఏదైనా ప్రణాళికతో వస్తున్నారా అనే ప్రశ్న అడిగారు. దీనికి ఆఫ్గన్ కెప్టెన్ సానుకూలంగా స్పందించాడు.
"ఆస్ట్రేలియా జట్టు కోసం ప్రణాళికలు ఉన్నాయి. మ్యాక్స్ వెల్ 2023 వరల్డ్ కప్ లో నిజంగా బాగా ఆడాడు. కానీ అది చరిత్రలో భాగం. ఆ తర్వాత మేము వారిని టీ20 ప్రపంచ కప్ లో ఓడించాము. మేము ప్రత్యర్థి జట్టు గురించి ఆలోచిస్తాము. కేవలం వ్యక్తిగత ఆటగాడి కోసం మేము ప్లాన్ చేయడానికి రావట్లేదు. మేము మ్యాక్స్ వెల్ తో మాత్రమే ఆటట్లేదు. ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతున్నాం. సెమీ-ఫైనల్ గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడిలోకి వెళ్లాలనుకోవట్లేదు". అని షాహిద్ మ్యాచ్ కు ముందు చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా జట్టు:
మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, తన్వీర్ సంఘ
ఆఫ్ఘనిస్థాన్ జట్టు:
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ అల్ అహ్మద్, ఫజల్హక్ అల్ ఫరూఖ్, ఇహ్మద్ నంగేయాలియా ఖరోటే, నవీద్ జద్రాన్