ICC Champions Trophy 2025: పుకార్లకు చెక్.. పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టనున్న ఆఫ్ఘనిస్తాన్

ICC Champions Trophy 2025: పుకార్లకు చెక్.. పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టనున్న ఆఫ్ఘనిస్తాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు పాకిస్థాన్ ఆతిధ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ఆడడం ఖాయమైపోయింది. దీని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ గడ్డపై అడుగుపెట్టనుంది. కొంతకాలంగా పాకిస్థాన్ లో పర్యటించడానికి ఆఫ్ఘనిస్తాన్ ఆసక్తి చూపించలేదనే వార్తలు వచ్చాయి. ఇటీవల కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక బోర్డ్ మీటింగ్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు  చైర్మన్ మిర్వాయిస్ అష్రఫ్, CEO నసీబ్ ఖాన్ తమ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. 

ఈ మీటింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి బృందం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో సమావేశమైంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి, మార్చిలో పాకిస్తాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టు పాకిస్థాన్ లో పర్యటిస్తుందని ఆఫ్గన్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది. దీంతో పాకిస్థాన్ కు కాస్త ఊరట కలిగింది. 2025లో పాకిస్తాన్ దేశంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించటం లేదు టీమిండియా.

బీసీసీఐ భారత్ ఆడే అన్ని మ్యాచ్ లను దుబాయ్ లేదా శ్రీలంకలో ఆడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆసియా కప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్ వైపే ఆసక్తి చూపిస్తుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు. 2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఉంటుందని.. మార్పు ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. 

పాక్ వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ.. ప్రతిపాదిత షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేశారు. దీని ప్రకారం గ్రూప్ ఏ లో  పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్,న్యూజిలాండ్.. గ్రూప్ బి లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆడతాయి.