Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్‌ను మెంటార్‌గా పట్టేసిన ఆఫ్ఘనిస్తాన్

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్‌ను మెంటార్‌గా పట్టేసిన ఆఫ్ఘనిస్తాన్

ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల తర్వాత జరగనున్న ఈ మెగా టోర్నీకి ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకు మాజీ పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ యూనిస్ ఖాన్‌ను బుధవారం( బుధవారం) మెంటార్‌గా నియమించింది. ఈ పాక్ మాజీ క్రికెటర్ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసేవరకు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మెంటార్ గా వ్యవహరించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి. టోర్నీ పాకిస్థాన్ లో జరుగుతుండడంతో యూనిస్ ఖాన్ సలహాలు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి. 

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈఓ నసీబ్ ఖాన్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జాతీయ జట్టుకు తాత్కాలిక మెంటార్‌గా యూనిస్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆఫ్ఘనిస్తాన్ సంతోషిస్తున్నట్లు తెలిపారు. కీలకమైన ఈ టోర్నీకి ముందు యూనిస్ ఖాన్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ తరపున యూనిస్ ఖాన్ 118 టెస్టుల్లో 52కి పైగా సగటుతో 10,099 పరుగులు చేశాడు. 265 వన్డేల్లో 7,249 పరుగులు, 25 టీ20ల్లో 442 పరుగులు చేశాడు. 2009లో కరాచీలో శ్రీలంకపై ట్రిపుల్ సెంచరీతో పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.

ALSO READ | Border–Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ సిరీస్.. పిచ్‌లకు ఐసీసీ రేటింగ్

ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగానే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తే.. యూఏఈలోనే సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.