Champions Trophy 2025: గ్రౌండ్‌లోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ జెర్సీ పట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తి

Champions Trophy 2025: గ్రౌండ్‌లోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ జెర్సీ పట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తి

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్లకు భద్రత కల్పించడంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి విఫలమైంది. గ్రౌండ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి హడావిడి చేశాడు. బుధవారం (ఫిబ్రవరి 26) లాహోర్ వేదికగా ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన తర్వాత ఆ జట్టు సెలెబ్రేషన్ చేసుకుంటుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి గ్రౌండ్ లోకి వేగంగా దూసుకొచ్చాడు. ఆఫ్ఘన్ ఆటగాళ్లను కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తూ మైదానం అంతా తిరిగాడు.  

కొంతమంది ఆఫ్గన్ క్రికెటర్ల జెర్సీ గట్టిగా పట్టుకొని వదల్లేదు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని చొరబాటుదారుడిని గ్రౌండ్ నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఇద్దరు భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. పాకిస్థాన్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. సోమవారం (ఫిబ్రవరి 24), న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లోనూ ఒక వ్యక్తి సెక్యూరిటీని దాటుకొని వచ్చి రచీన్ రవీంద్రను వెనక నుంచి పట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మార్చి 9 వరకు జరగనుంది. ఈ లోపు ఆటగాళ్లకు భద్రతను పెంచుతామని ఆ పాక్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది. 

ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. పటిష్టమైన ఇంగ్లాండ్ ను బోల్తా కొట్టించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. లాహోర్ వేదికగా ఇంగ్లాండ్ పై తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్  నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో వరుసగా రెండు ఓటములతో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుని సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.