తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్తాన్ ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఆగస్టు 28 న దేశంలోని ఓ పర్వత ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని కాబూల్ నుంచి 300 కి.మీ. ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతంలో ఈ ప్రకృతి విపత్తు జరిగింది.
అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. భూకంపం ధాటికి పొరుగునే ఉన్న పాకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు సైతం ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. 2022 జూన్ లో వచ్చిన భూకంపం ధాటికి వెయ్యి మంది మరణించారు, 1,500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
అప్పుల ఊబిలో దేశం..
ఆఫ్గనిస్థాన్ తాలిబన్ల పాలన కిందకి వెళ్లినప్పటి నుంచి మానవ స్వేచ్ఛ ప్రశ్నార్థకమైంది. దీనికి తోడు మహిళల చదువులపై ఆంక్షలు, నిర్బంధాలు ఆ దేశ ప్రగతికి నిరోధకంగా మారాయి. ప్రశ్నించే వారికి బెదిరింపులు ఎక్కువయ్యాయి.
పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రాకపోవడంతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. దీనికి తోడు వరుస భూకంపాలు ఆర్థిక పరిస్థితిపై పుండు మీద కారంలా పరిణమించాయి. జీడీపీ పడిపోతుండటం, ఆహార ధాన్యాల కొరతతో ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. చివరికి వేరే దేశాలకు చేయి చాచే పరిస్థితి దాపురించింది.