అమెరికా నేతృత్వంలోని నాటో దేశాల సైనిక బలగాలను 2021 సెప్టెంబర్ నాటికి అఫ్గానిస్థాన్ నుంచి విరమించుకుంటామని జోబైడెన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే గడువు కంటే ముందుగానే మెజారిటీ బలగాలను వెనక్కి రప్పించింది. ఇంతకాలం తాలిబన్ల నుంచి నాటో బలగాల రక్షణతోనే కొద్దో గొప్పో శాంతియుత, ప్రజాస్వామ్య వాతావరణంలో పాలన సాగిస్తున్న అఫ్గానిస్థాన్.. ఇప్పుడు ప్రమాదంలో పడ్డట్లయింది. తాలిబన్ల సైన్యంతో పోలిస్తే.. అఫ్గాన్ సైన్యం చాలా తక్కువ. ఎంత పోరాడినా.. ఏదో ఓ క్షణంలో తాలిబన్లు ఆ దేశాన్ని కబళించడం ఖాయం. విదేశీ రక్షణ దళాలు వెనక్కి వెళ్లిపోవడం.. ఇప్పటికే అఫ్గాన్‌లో నానా బీభత్సం సృష్టిస్తూ.. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్న తాలిబన్లకు రెట్టింపు బలాన్ని చేకూర్చినట్లు అవుతుంది. విదేశీ బలగాల అడ్డుగోడలు తొలగిపోవడంతో తాలిబన్లకు చేయూతనిచ్చేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత టెర్రరిస్ట్సంస్థలు 20కి పైగా ముందుకు వస్తున్నాయి. ప్రపంచ దేశాలు వెంటనే అలర్ట్అయి ఈ దాడిని ఆపకపోతే.. తాలిబన్లు ఆఫ్గాన్‌ను దహించడంతోనే ఆగిపోరు.. టెర్రరిజాన్ని మరింత పెంచి ప్రపంచానికి కొరకరాని కొయ్యగా మారుతారు. అతివాదం, హింస పెచ్చురిల్లి అన్ని దేశాలకు పాకుతుంది. అంతర్జాతీయంగా అశాంతి నెలకొంటుంది.
అఫ్గాన్‌లో ప్రభుత్వానికి తాలిబన్లకు మధ్య జరుతున్న పోరు తెలిసిందే. అమెరికా బలగాలు వెనక్కి తగ్గనుండటంతో అఫ్గాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఆగస్టు 1న కాందహార్ ఎయిర్పోర్ట్ పై టెర్రరిస్టుల దాడికి ప్రతిచర్యగా అఫ్గాన్ ప్రభుత్వం 24 గంటల పాటు మిలిటెంట్ల రహస్య స్థావరాలపై గురిపెట్టి వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనల్లో 250కి పైగా తాలిబన్లు మరణించారు. అఫ్గాన్ ప్రభుత్వ బలగాలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా.. అమెరికా లేదంటే రష్యా సాయుధ బలగాల హెల్ప్లేకుండా ఉగ్ర మూకను నిలువరించడం కష్టతరంగానే మారింది. ఒకప్పటి శక్తివంత సంస్థలైన యూఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ ల మధ్య ఆధిపత్య పోరులో అఫ్గానిస్థాన్ భూభాగం యుద్ధ క్షేత్రంగా మారింది. 1978–89 మధ్య కాలంలో రష్యా సపోర్ట్‌తో ఏర్పడిన కమ్యూనిస్ట్ పాలనకు చరమగీతం పాడడానికి పెషావర్‌లోని ముజాహిదీన్లు రష్యాకు వ్యతిరేకంగా పోరాడి1989లో సఫలమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న 57 ఇస్లామిక్ దేశాలు ఉగ్రవాద ఊడల్ని విశ్వవ్యాప్తం చేస్తూ ప్రపంచ మనుగడను ప్రమాదంలో పడేశాయి. అప్పటి పరిస్థితుల ప్రకారం1994లో రష్యాను పరోక్షంగా అడ్డుకునేందుకు అమెరికా పెంచి పోషించిన తాలిబన్ల పాలన1996 నుంచి 2001 వరకు సజావుగానే కొనసాగినా.. తర్వాత సవాలుగా మారింది. ముస్లిం దేశాలన్నీ షియా, సున్నీ, అహ్మదీస్ లాంటి వర్గాలుగా ఉన్నాయి. వీటి మధ్య అంతర్గత విభేదాలతో ఆయా దేశాల్లో వందల ఉగ్రవాద గ్రూపులు పురుడుపోసుకున్నాయి. సున్నీలు అత్యధిక మెజారిటీ కలిగిన సిరియాలో షియా వర్గం రష్యా సాయంతో ‘బషర్ అల్ అసద్’ పాలన కొనసాగుతోంది. సున్నీ వర్గ ప్రజలు ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థతో కలిసి బషర్ అల్ అసద్‍ను గద్దె దించడానికి విఫలయత్నం చేశారు. షియా వర్గం అధికంగా ఉన్న ఇరాక్‌లో సున్నీ వర్గానికి చెందిన సద్దాం హుసేన్ దీర్ఘకాలం పాలన చేశారు. షియా వర్గం అధికంగా ఉన్న ఇరాన్‌కు ఈ విషయం మింగుడుపడని కారణంగా ఇరాన్, ఇరాక్‌ల మధ్య దశాబ్దాల పోరాటం జరిగింది.
అండగా నిలువాలి..
నాటో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లో అశాంతి జ్వాలలు ఎగిసిపడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో ఒకవైపు ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య అంతర్గత పోరు జరుగుతుండగా.. ఆ దేశంలో ఖనిజ సంపదపై కన్నేసిన చైనా కూడా ఈ పోరాటాగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రదేశాలు తమ స్వార్థ పూరిత ఆలోచనలతో సూపర్ పవర్లుగా నిలవాలనే దుర్బుద్ధితో గతంలో ప్రోత్సహించిన పలు సంస్థలు నేడు తీవ్రవాద కేంద్రాలుగా వెలసి ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి. ప్రస్తుత అగ్రరాజ్యాలు, వర్థమాన దేశాలు సంకుచిత భావాలను వదిలి.. తాలిబన్లను ఎదుర్కొని, అఫ్గాన్‌కు అండగా నిలబడాలి. వసుదైక కుటుంబ భావనలకు ప్రాణం పోయాలి.
తాలిబన్ల చేతిలో లక్షలాది మంది..
యుఎస్ నాయకత్వంలోని నాటో దేశాల బలగాలను వెనక్కి వెళ్లిపోతుండటం.. అఫ్గాన్‌లోని తాలిబన్లకు పెద్ద అవకాశంగా మారింది. అమెరికా బలగాలు తొలగిపోతుండటంతో తాలిబన్లు అఫ్గాన్ ప్రాంతాలను మెల్లమెల్లగా హింసా మార్గంలో ఆక్రమిస్తున్నారు. ప్రజల్ని చిత్రవధ చేయడం, బాలికల్ని బలవంతంగా పెండ్లి చేసుకోవడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఒకవేళ తాలిబన్లు మరోసారి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటే ప్రపంచ శాంతి, మత సామరస్యాలు, భద్రతలకు విఘాతం కలగడం ఖాయం. 1990, 2000 డికేడ్స్లో భారత్ తాలిబన్లను కొంత మేరకు వ్యతిరేకించడంతో పాటు అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలతో సమస్యను అధిగమించాలని అభిప్రాయపడింది. 11 సెప్టెంబర్ 2021 నాటికి అమెరికాలోని డబ్ల్యూటీఓపై టెర్రర్ దాడికి రెండు దశాబ్దాలు పూర్తి కానుంది. దీంతో అఫ్గాన్‌లో అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. సరైన టైం కోసం చూస్తున్న తాలిబన్లకు అమెరికా డెసిషన్ తో రెట్టింపు బలం పెరిగింది. అఫ్గాన్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఎగుమతి, దిగుమతుల రవాణాలను తాలిబన్లు అడ్డగించడంతో అనేక మిలియన్ డాలర్ల రెవెన్యూ పడిపోయింది. దీంతో ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అఫ్గాన్‌లోని పలు ముఖ్య పోర్టులను ఆక్రమించిన తాలిబన్లు అశ్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని బలహీన పరచడంలో సఫలమవుతోంది. రెండు దశాబ్దాలుగా 36 యూఎస్-నాటో దేశాలు అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పడానికి చేసిన ప్రయత్నాల్లో తాలిబన్ల దాడిలో 2,442 మంది వీరులు, 800 మంది ప్రైవేట్ సెక్యూరిటీ, 1,144 మంది సైనికులు, 72 మంది జర్నలిస్టులు, 444 సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 1979-89ల మధ్య రష్యాకు చెందిన 14,400 మంది జవాన్లు కూడా మృతిచెందారు. చరిత్ర లెక్కల ప్రకారం తాలిబన్ల పోరులో 1.17 లక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 10 మిలియన్ల మంది ప్రజలు క్షతగాత్రులుగా మిగిలారు.
అఫ్గాన్-ఇండియా రిలేషన్స్
అఫ్గాన్‌తో దూరంగా ఉంటూ వస్తున్న ఇండియా ప్రస్తుతం 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో రోడ్లు, బాలికల పాఠశాలలు, డ్యామ్‌లు, విద్యుత్, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ హోమ్స్ లాంటివి పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. భారత్ అభివృద్ధి చేసిన మౌలిక వసతులను తాలిబన్లు నాశనం చేయడం, ప్రజల్ని చంపడం, చిత్రహింసలకు గురి చేయడం సర్వసాధారణమైంది. కాశ్మీర్ అంశాన్ని సజీవం చేస్తున్న తాలిబన్లు పాక్‌తో కలిసి భారత్‌ను అస్థిర పరచాలని చూస్తున్నారు. 2017 వ్యాపార ఒప్పందంలో భాగంగా ఏయిర్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇండియా నుంచి అఫ్గాన్‌కు 900 మిలియన్ డాలర్ల ఎగుమతులు, 500 మిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి డ్రై ఫ్రూట్స్ అధికంగా దిగుమతి అవుతున్నాయి. ఎగుమతుల్లో ఫార్మా, మెడికల్ పరికరాలు, సిమెంట్, రా మెటీరియల్, షుగర్, కంప్యూటర్లు తదితర వస్తువులు ఉన్నాయి. ఢిల్లీ –- కాబూల్, హీరత్ – ఢిల్లీల మధ్య ప్రస్తుతం వాణిజ్యం జరుగుతోంది. -నాటో బలగాలు ఇప్పుడప్పుడే వెళ్లి పోవని భావించిన భారత్‌కు కొంత ఇబ్బందే ఎదురైంది. అధికారికంగా గుర్తించనప్పటికీ తాలిబన్లు ఇప్పటికే 400కు పైగా జిల్లాలను ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్ర సంస్థతో ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగేలా ఇండియా లాంటి దేశాలు చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే రష్యా, ఇరాన్, పాక్, చైనా లాంటి దేశాలు అఫ్గానిస్థాన్ సమస్యకు తమదైన పరిష్కారం చూపి, ఇండియాను బలహీన పరిచే కుట్రలు చేసే అవకాశం లేకపోలేదు. అఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ‘దోహ చర్చలు’ మాత్రమే ఏకైక పరిష్కారమని తెలుసుకోవాలి. రష్యా, ఇరాన్లతో కలిసి ఇండియా సత్వరమే తగిన పరిష్కారం చూపకుంటే అఫ్గాన్ ప్రాంతం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, కరీంనగర్