సౌతాంప్టన్: సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో బంగ్లాదేశ్ సోమవారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. విండీస్‌పై అలవోక ఛేజింగ్, ఆసీస్‌తో భారీ టార్గెట్ ఎదురైనా చక్కని పోరాట పటిమను కనబర్చిన బంగ్లా పులులు.. ఇదే జోరులో అఫ్గాన్‌నూ ఓడించి నాకౌట్ అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నారు. బ్యాటింగ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మహ్మదుల్లా, తమీమ్, ముష్ఫికర్ కూడా అవసరమైనప్పుడు సత్తా చాటుతుండటం బంగ్లాకు సానుకూలాంశం. అయితే పేలవ బౌలింగ్‌తో భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టును కలవరపెడుతున్నది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా దీనిని సరి చేసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టిసారించింది.
గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడటంతో సమీకరణాలు మారిన నేపథ్యంలో వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని బంగ్లా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన అఫ్గానిస్థాన్ బోణీ కోసం ప్రయత్నాలు చేస్తున్నది. ఇండియాతో మ్యాచ్‌లో ఓడినా.. చివరివరకు పోరాట స్ఫూర్తిని చూపెట్టి అందరి మనసుల్ని దోచుకుంది. బంగ్లా చిన్న ప్రత్యర్థే కావడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి కొంతైన ఉపశమనం చెందాలని భావిస్తున్నది. బ్యాటింగ్ కంటే బౌలింగ్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టిన అఫ్గాన్.. స్పిన్నర్లపై అధిక భారం వేసింది. రషీద్, నబీ, ముజీబుర్ మెరిస్తే బంగ్లాకు ఇబ్బందులు తప్పవు.