T20 World Cup 2024: క్రికెట్ ఒక్కటే మాకు ఆనందాన్ని ఇస్తుంది.. ఆఫ్గనిస్తాన్ జనం ఎమోషన్

T20 World Cup 2024: క్రికెట్ ఒక్కటే మాకు ఆనందాన్ని ఇస్తుంది.. ఆఫ్గనిస్తాన్ జనం ఎమోషన్

ఆఫ్గనిస్తాన్ దేశం.. నాలుగేళ్ల క్రితం తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అంతా మారిపోయింది. తాలిబన్ల రాజ్యంలో మహిళలకు స్వేచ్ఛ లేదు.. పిల్లలకు స్వేచ్ఛ లేదు.. ఉపాధి లేదు.. ఉద్యోగం లేదు.. అంతా నిర్బంధం.. ఏం చేయాలన్నా.. ఏది చేయాలన్నా అన్నీ ఆంక్షలే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ నాలుగేళ్లలో మాకు క్రికెట్ ఒక్కటే ఆనందాన్ని ఇస్తుంది.. ఆఫ్గనిస్తాన్ దేశం.. టీ20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు వెళ్లటం మాకు పండగలా ఉంది. మరోసారి ఈద్ వచ్చిందా అన్నంత సంతోషంగా ఉంది.. మా ప్రత్యర్థి పాకిస్తాన్ ఇంటికెళ్లినప్పుడు వచ్చిన ఆనందం కంటే.. ఇప్పుడు రెట్టింపు సంతోషంగా ఉన్నాం అంటూ ఆఫ్గనిస్తాన్ పౌరులు వీధుల్లో సంబరాలు చేసుకుంటున్నారు.

టీ 20 వరల్డ్ కప్  కీలకమైన మ్యాచ్ లో.. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ జట్టును ఓడించి.. ఆస్ట్రేలియా జట్టును ఇంటికి పంపించి.. సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది ఆఫ్గనిస్తాన్ జట్టు. అండర్ డాగ్ గా ఎంట్రీ అయ్యి.. అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ కు సిద్ధం అయ్యింది. వరల్డ్ కప్ కొట్టటానికి రెండే రెండు అడుగుల దూరంలో ఉంది. 

ఇంతటి ఘన విజయంతో.. క్రికెట్ ప్రపంచంలో ఆఫ్గనిస్తాన్ జట్టు సాధిస్తున్న అద్భుత విజయాలతో ఆఫ్గనిస్తాన్ దేశంలో పండగ వాతావరణ నెలకొంది. 50 ఓవర్లలో క్రికెట్ వరల్డ్ కప్ లోనూ.. పాకిస్తాన్ జట్టును ఓడించటం.. గత నాలుగేళ్లుగా.. క్రికెట్ లో ఆఫ్గనిస్తాన్ జట్టు సాధిస్తున్న అద్భుత విజయాలే.. ఆఫ్గనిస్తాన్ జనానికి సంతోషం ఇస్తున్నాయి.. ఆఫ్గనిస్తాన్ యువతకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అంటున్నారు అక్కడి యువత..ఆఫ్గనిస్తాన్ దేశం మొత్తం సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే.. తాలిబన్ సెక్యూరిటీ మాత్రం వాటర్ కెనాన్స్ ఉపయోగించి.. జనాన్ని చెదరగొడుతుంది అంట..

మంగళవారం (జూన్ 25) సూపర్-8 లో భాగంగా జరిగిన చివరి వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో  గెలిచి వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. డక్ వర్త్ లూయిస్ విధించిన 114 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 105 పరుగులకు ఆలౌటైంది.