పాకిస్థాన్, అఫ్ఘాన్‌ల వల్ల పోలియో ముప్పు

పాకిస్థాన్, అఫ్ఘాన్‌ల వల్ల పోలియో ముప్పు

ప్రపంచం నుంచి పోలియో వ్యాధిని పారదోలాలన్న లక్ష్యానికి పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ దేశాలు ముప్పుగా మారుతున్నాయని ప్రపంచ దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇటీవలే యూపీలోని ఆగ్రాలో భారత్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాల ప్రతినిధులు పోలియో నిర్మూలనపై సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలన క్యాంపెయిన్ విజయవంతంగా సాగుతోందని వారు అన్నారు. అయితే పాక్, అఫ్ఘాన్‌లలో మాత్రం ఇది సరిగా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా పోలియో కేసులన్నవే నమోదు కాని సమయంలో ఒక్క 2019లోనే పాక్‌లో 177, అఫ్ఘాన్‌లో 26 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు దేశాల గుండా పోలియో వైరస్ భారత్‌లోకి వ్యాపించే ప్రమాదం లేకపోలేదని పలు దేశాల ప్రతినిధులు లక్నో సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో ఐదేళ్లు వచ్చే వరకు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో కార్యక్రమంలో రెగ్యులర్‌గా పోలియో డ్రాప్స్ వేయించాలని ఈ సదస్సు కోరింది.

ఈ విషయంపై సామాజిక కార్యకర్త అమిర్ ఖురేషీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఆర్తోడాక్స్ ముస్లిం కుటుంబాలు తమ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించడం లేదన్నారు. ఈ డ్రాప్స్ వల్ల భవిష్యత్తులో వారికి సంతాన సాఫల్యత శక్తి కోల్పోతారని వారిలో అపోహ ఉందని చెప్పారు. పోలియో డ్రాప్స్‌ పూర్తిగా సేఫ్ అని ప్రపంచమంతా తెలిసిన విషయమేనని, వాటి వల్ల ప్రమాదం ఉందంటే ఎవరూ నమ్మొద్దని కోరారు. ఎవరైనా తమ పిల్లలకు పోలియో డ్రాప్ వేయించకపోయినా మత గురువు చెప్పి వేయించేలా చూడాలన్నారు.