Champions Trophy 2025: రికార్డ్ సెంచరీతో హోరెత్తించిన జద్రాన్..ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

Champions Trophy 2025: రికార్డ్ సెంచరీతో హోరెత్తించిన జద్రాన్..ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

ఛాంపియన్స్ ట్రోఫీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జూలు విదిలించింది. లాహోర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అదరగొట్టింది. ప్రారంభంలో మూడు వికెట్లు కోల్పోయినా ఆసాధారణ అట తీరుతో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(146 బంతుల్లో 177: 12 ఫోర్లు, 6 సిక్సర్లు)ఆకాశమే హద్దుగా  చెలరేగి భారీ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓమర్జాయ్(41), షాహిదీ(40), నబీ (40) కీలక ఇన్నింగ్స్ ఆడారు.   

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ కు మంచి ఆరంభం లభించలేదు. ఒక దశలో 37 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫరా ఆర్చర్ విజ్రంభించి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో ఆఫ్గన్ స్కోర్ 250 పరుగులు చేసినా గ్రేట్ అనుకున్నారు. అయితే ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ షాహిదీ ముందు ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. నాలుగో వికెట్ కు వీరిద్దరూ 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత ఓమార్జాయి తావు కలిసి  జద్రాన్ ఇన్నింగ్స్ వేగం పెంచాడు. 

ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో జద్రాన్ 106 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో వేగంగా ఆడబోయి ఓమర్జాయ్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక నబీతో కలిసి జద్రాన్ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీర విధ్వంసం సృష్టిస్తూ శరవేగంగా పరుగులు రాబట్టారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ చూస్తుండగానే 300 పరుగుల మార్క్ దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, ఓవర్ టన్ లకు తలో వికెట్ లభించింది.