- 7 వికెట్ల తేడాతో పపువా న్యూగినియాపై గెలుపు
- రాణించిన ఫారూకీ, గుల్బాదిన్
తరౌబా: హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారి సూపర్–8లో చోటు సంపాదించింది. పేసర్లు ఫజల్‌హక్ ఫారూకీ (3/16), నవీన్ ఉల్ హక్ (2/4)తో పాటు బ్యాటింగ్‌లో గుల్బాదిన్ నైబ్ (36 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్) రాణించడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్–-సి మ్యాచ్‌లో అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాపై గెలిచింది. టాస్ ఓడిన గినియా 19.5 ఓవర్లలో 95 రన్స్‌కే ఆలౌటైంది. కిప్లిన్ డొరిగా (27) టాప్ స్కోరర్. స్టార్టింగ్ నుంచే ఫారూకీ, నవీన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గినియా లైనప్‌ను కట్టడి చేశారు. దీంతో టోనీ ఉర (11), అసద్ వాలా (3), లిగా సియాకా (0), సేసే బావు (0), హిరి హిరి (1), చాద్ సోపర్ (9), నార్మన్ వనువా (0) వరుస విరామాల్లో ఔటయ్యారు.
ఫలితంగా 50 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను డొరిగా ఆదుకునే ప్రయత్నం చేశాడు. అలెలీ నావో (13)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 38 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. చివర్లో జాన్ కరికో (4 నాటౌట్), సీమో కెమియా (2) రాణించకపోవడంతో గినియా పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 15.1 ఓవర్లలో 101/3 స్కోరు చేసి నెగ్గింది. ఇబ్రహీం జద్రాన్ (0), గుర్బాజ్ (11), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (13) ఫెయిలయ్యారు. దాంతో 55/3 తడబడిన ఇన్నింగ్స్‌ను నైబ్ చక్కదిద్దాడు. మహ్మద్ నబీ (16 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్‌కు 46 రన్స్ జోడించి జట్టును గెలిపించాడు. ఫారూకీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
న్యూజిలాండ్ ఔట్..
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్–సిలో అఫ్గానిస్తాన్ (6), వెస్టిండీస్ (6) సూపర్–8కు అర్హత సాధించడంతో కివీస్‌కు దెబ్బపడింది. ఇక ఉగాండా, గినియాతో జరిగే ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో కివీస్ గెలిచినా ముందుకెళ్లే చాన్స్ లేదు.