T20 World Cup 2024: టాప్ జట్లపై సంచలన విజయాలు: అగ్ర శ్రేణి జట్టుగా దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్

T20 World Cup 2024: టాప్ జట్లపై సంచలన విజయాలు: అగ్ర శ్రేణి జట్టుగా దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్

క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇప్పటికీ పసికూన జట్టుగానే పేరుంది. రషీద్ ఖాన్, ముజీబ్, నబీ, నవీన్ ఉల్ హక్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. ఒత్తిడిలో చిత్తవ్వడం ఆ జట్టుకు అలవాటు. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు కనీసం నాకౌట్ కు చేరలేకపోయిన ఆఫ్ఘనిస్తాన్ జట్టును నిన్నటివరకు ఒక చిన్న జట్టులాగే చూశారు. తమదైన రోజున ఒక పెద్ద జట్టుకు షాక్ ఇచ్చినా నిలకడగా ఆడలేదనే పేరుంది. అయితే ఇప్పుడు సీన్ మారింది. అద్భుతమైన ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ 2024లో ఏకంగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. సూపర్ -8 కు చేరుకొని సంచలనంగా మారిన ఆ జట్టు.. వరల్డ్ కప్ సెమీస్ లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. 

గ్రూప్ దశలో న్యూజిలాండ్ పై భారీ విజయాన్ని సాధించి టాప్ జట్లకు తమతో ప్రమాదమని సంకేతాలు పంపింది. వరల్డ్ కప్ లో గొప్ప రికార్డ్ ఉన్న కివీస్ ను ఓడించి సూపర్-8 కు చేరుకున్న ఆఫ్గన్లు.. ఇక్కడ కూడా తమ సత్తా చూపించారు. తొలి మ్యాచ్ భారత్ చేతిలో ఓడిపోయినా.. ఆ తర్వాత ప్రపంచంలోనే బలమైన ఆస్ట్రేలియా జట్టుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. సెమీస్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆసీస్ పై 21 పరుగుల తేడాతో గెలిచి ఈ వరల్డ్ కప్ లోనే అతి పెద్ద సంచలనం నమోదు చేసింది.సెమీస్ లోకి అడుగుపెట్టాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
 
ఈ విజయంతో వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీస్ కు చేరుకున్న జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించింది. సంచలన విజయాలు సాధించడం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కొత్తేమి కాదు. భారత్ వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పెద్ద జట్లకు ఊహించని షాక్ ఇచ్చింది. టోర్నీ ప్రారంభంలో తొలి రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఈ జట్టు ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ కు బిగ్ షాక్ ఇచ్చింది. అయితే ఈ విజయం గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ పాకిస్థాన్ పై మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇదే ఊపులో శ్రీలంకపై ఈజీ విక్టరీ కొట్టి వరల్డ్ కప్ సెమీస్ కు వెళ్లినంత పని చేసింది. 

దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాపై గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీస్ కు చేరలేకపోయింది. అయితే టీ20 వరల్డ్ కప్ ద్వారా తమ కలను నెరవేర్చుకుంది. ఇకపై ఆఫ్ఘనిస్తాన్ జట్టంటే పెద్ద జట్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెమీస్ లో సౌతాఫ్రికాను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ లు సఫారీలు ఆఫ్ఘనిస్తాన్ జట్టును తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం తప్పదు. రషీద్ ఖాన్, ముజీబ్, నబీ, నవీన్ ఉల్ హక్ లాంటి బౌలింగ్ దళంతో దుర్బేధ్యంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో మెరుగు పడితే ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నీలో ఫైనల్ కు చేరినా ఆశ్చర్యం లేదు.