Champions Trophy 2025: అద్భుతం జరగాల్సిందే: ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇవే లెక్కలు!

Champions Trophy 2025: అద్భుతం జరగాల్సిందే: ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇవే లెక్కలు!

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తానం దాదాపుగా ముగిసింది. లాహోర్ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను దెబ్బ తీసింది. వరుణుడు దెబ్బకు ఈ మ్యాచ్ లో ఫలితం రాలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. మ్యాచ్ రద్దు కావడంతో నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరింది. మరోవైపు మూడు పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ రేస్ లో నిలిచింది. ఇదే గ్రూప్ లో ఇప్పటికే ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్ రేస్ లో నిలిచాయి. 

ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే:

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో సౌతాఫ్రికాతో సమానంగా మూడు పాయింట్లు ఉన్నాయి. శనివారం (మార్చి 1) ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిస్తే నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. అదే జరిగితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరాలంటే ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో సౌతాఫ్రికా భారీ తేడాతో ఓడిపోవాలి. మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తే సౌతాఫ్రికాను 207 పరుగుల తేడాతో ఓడించాలి. ఒకవేళ మొదట సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తే 11.1 ఓవర్లలో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేధించాలి.

ALSO READ : Champions Trophy 2025: స్టీవ్ స్మిత్ క్రీడా స్ఫూర్తి.. అప్పీల్ వెనక్కి తీసుకున్న ఆసీస్ కెప్టెన్

ఇలా జరిగితే సౌతాఫ్రికా కంటే ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్ మెరుగై సెమీస్ కు చేరుతుంది. అలా కానిచో సౌతాఫ్రికా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా నెట్ రన్ రేట్ 2.14 గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్ -0.99 గా ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే నాలుగు పాయింట్లతో సౌతాఫ్రికా సెమీస్ కు చేరుతుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా ఫామ్ చూస్తుంటే ఇంగ్లాండ్ పై ఇంత భారీ తేడాతో గెలిచే అవకాశం లేదు. దీంతో గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు గ్రూప్ ఏ లో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.