- ‘ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్’లో 8 దేశాల స్పష్టీకరణ
- ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం దక్కాలె
- టెర్రరిస్టులకు అడ్డాగా మారొద్దని ‘ఢిల్లీ డిక్లరేషన్’ విడుదల
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ లో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని ఇండియా, రష్యా, ఇరాన్ తోపాటు మరో ఐదు సెంట్రల్ ఆసియా దేశాలు స్పష్టం చేశాయి. ‘సురక్షిత, సమగ్ర, స్థిరమైన అఫ్గానిస్తాన్’ కోసం అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించాయి. అఫ్గాన్ ప్రజల కోరిక మేరకు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షించాయి. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగిన ‘అఫ్గానిస్తాన్ పై ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్’ సదస్సులో ఎనిమిది దేశాల ఎన్ఎస్ఏలు పాల్గొన్నారు. అఫ్గానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన తర్వాత సదస్సులో ‘ఢిల్లీ డిక్లరేషన్’ను ప్రకటించారు. సదస్సుకు ఇండియా, రష్యా, ఇరాన్, కజాకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, తజకిస్తాన్ దేశాల ఎన్ఎస్ఏలు హాజరయ్యారు. చైనా, పాకిస్తాన్‌కు ఇన్విటేషన్ పంపినా, ఆ దేశాలు హాజరు కాలేదు.
ఢిల్లీ డిక్లరేషన్‌లో ఏముందంటే..
అఫ్గాన్ గడ్డ టెర్రరిస్టులకు అడ్డగా మారొద్దని, ఆ దేశంలో ఎట్టిపరిస్థితుల్లోనూ టెర్రరిస్టులకు ట్రెయినింగ్, ఆశ్రయం, ఫండింగ్ ఇవ్వొద్దని ఢిల్లీ డిక్లరేషన్ స్పష్టం చేసింది. డ్రగ్ ట్రాఫికింగ్‌ను కూడా అరికట్టాలని సూచించింది. అఫ్గాన్‌లో ప్రజల కోరిక మేరకు ‘ఓపెన్, సెక్యూర్, స్టేబుల్, ఇన్ క్లూసివ్’ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షించింది. అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని అన్ని దేశాలు గౌరవించాలని, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశమూ జోక్యం చేసుకోరాదంటూ పరోక్షంగా పాకిస్తాన్‌కు చురక వేసింది. తాలిబాన్ల తిరుగుబాటు తర్వాత దేశంలో ఆర్థిక, సామాజిక పరిస్థితి క్షీణించిందని, ప్రజలు అతిఘోరమైన మానవతా సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చిందని సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గాన్ ప్రజలను ఆదుకునేందుకు అన్నిదేశాలూ తగిన సహకారం అందించాలని, ప్రపంచ దేశాలు అందించే సాయాన్ని అక్కడి ప్రభుత్వం ఎలాంటి విచక్షణ లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందించాలని చెప్పింది. మైనారిటీలు, పిల్లలు, మహిళల హక్కులను గౌరవించాలని స్పష్టం చేసింది. కరోనా నిర్మూలనలోనూ ఆ దేశానికి సాయం చేయాలని నిర్ణయించింది. కాగా, అఫ్గానిస్తాన్ లో పరిస్థితిపై ఆసియన్ దేశాలు కలిసి ప్రాంతీయంగా నిర్వహించిన మూడో సదస్సు ఇది. ఇంతకుముందు 2018, 2019లో ఇరాన్లో రెండు సదస్సులు జరిగాయి.
పొరుగుదేశాలపైనా ‘అఫ్గాన్’ ఎఫెక్ట్: దోవల్
అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితుల వల్ల పొరుగుదేశాలపైనా గణనీయమైన ప్రభావం పడుతుందని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అన్నారు. ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్ సదస్సుకు అధ్యక్షత వహించిన దోవల్ ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. అఫ్గాన్ విషయంలో అన్ని దేశాలు సంప్రదింపులు కొనసాగిస్తూ, కోఆర్డినేషన్‌తో సహకారం అందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, సదస్సు తర్వాత అన్ని దేశాల ఎన్ఎస్ఏలు కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సదస్సులో చర్చించిన అంశాలను ప్రధానికి వివరించారు.