Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లాహోర్ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వరుణుడు దెబ్బకు ఫలితం రాలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. మ్యాచ్ రద్దు కావడంతో నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరింది. మరోవైపు మూడు పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ రేస్ లో నిలిచింది.

12.5 ఓవర్ల ఆటే సాధ్యం:

274 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను  ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, షార్ట్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో ఆస్ట్రేలియా తొలి 5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. షార్ట్ (20) ఔటైనా.. స్టీవ్ స్మిత్ తో కలిసి హెడ్ శరవేగంగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు వద్ద భారీగా వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. కాసేపటికీ వర్షం తగ్గినా.. పిచ్ మీద వర్షం నీరు నిలిచిపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.  ట్రావిస్ హెడ్ (59), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (19) క్రీజ్ లో ఉన్నారు. 

ALSO READ : Jos Buttler: ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస ఓటములు.. కెప్టెన్సీకి రాజీనామా చేసిన బట్లర్

రాణించిన అటల్, ఓమర్జాయ్:
  
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ టాపార్డర్ లో సెదికుల్లా అటల్ (85), మిడిల్ ఆర్డర్ లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (70) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. అటల్ 95 బంతుల్లో 6 ఫోర్లు.. 3 సిక్సర్లతో 85 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు. ఓమర్జాయ్ 63 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 273 పరుగులకు చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టాడు. స్పెన్సర్ జాన్సన్, ఆడం జంపా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఎల్లిస్, మ్యాక్స్ వెల్ లకు తలో వికెట్ లభించింది.