
గ్రేటర్ నోయిడా వేదికగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు వర్షం కారణంగా రద్దయ్యింది. పిచ్ చిత్తడిగా ఉండటంతో ఆట సాధ్యపడకపోగా.. చివరి మూడు రోజులు వర్షం వల్ల మ్యాచ్ జరగలేదు. దాంతో, ఇరు జట్ల కెప్టెన్లు ఫోటో షూట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
శుక్రవారం(సెప్టెంబర్ 13) ఉదయం నోయిడాలో భారీ వర్షం కురవడంతో ఐదో రోజు ఆట సాధ్యపడలేదు. దాంతో, అంపైర్లు మ్యాచ్ రద్దు అయినట్లు ప్రకటించారు. కనీసం ఈ మ్యాచ్ టాస్ కూడా వేయకపోవడం గమనార్హం. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క బంతి పడకుండా మ్యాచ్ రద్దు చేయడం ఇది ఎనిమిదోసారి కాగా.. భారత గడ్డపై తొలిసారి. 1933 నుంచి భారత్ టెస్టులకు ఆతిథ్యం ఇస్తోంది.
The end to the non-starter of a Test match #AFGvNZ
— Cricbuzz (@cricbuzz) September 13, 2024
The final day has also be called off. pic.twitter.com/48XiNwvgTb
ఆసియాలో రెండో టెస్టు
రద్దయిన ఆఫ్ఘనిస్తాన్- న్యూజిలాండ్ రికార్డుల్లోకెక్కింది. భారత గడ్డపై ఒక టెస్టు మ్యాచ్ బంతి కూడా వేయకుండా రద్దు చేయడం 91 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఆసియాలో ఇంతకు ముందు 1998లో ఫైసలాబాద్ వేదికగా పాకిస్థాన్- జింబాబ్వే మధ్య జరిగిన టెస్ట్ ఒక్క బంతి వేయకుండానే రద్దయ్యింది.
బంతి వేయకుండానే రద్దయిన టెస్ట్ మ్యాచ్‌లు
- 1890: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (మాంచెస్టర్)
- 1938: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (మాంచెస్టర్)
- 1970: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (మెల్‌బోర్న్)
- 1989: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ (డునెడిన్)
- 1990: వెస్టిండీస్ vs ఇంగ్లాండ్, (జార్జిటౌన్)
- 1998: పాకిస్తాన్ vs జింబాబ్వే (ఫైసలాబాద్)
- 1998: న్యూజిలాండ్ vs ఇండియా (డునెడిన్)
- 2024: ఆఫ్ఘనిస్తాన్ vs న్యూజిలాండ్, గ్రేటర్ నోయిడా(ఇండియా)