- దేశ రాజధాని కాబూల్ లోకి ఎంటరైన మిలిటెంట్లు
- తజకిస్తాన్ పారిపోయిన ప్రెసిడెంట్ అష్రఫ్ ఘని
- ప్రెసిడెంట్ ప్యాలెస్‌లోకి తాలిబాన్ ప్రతినిధులు
- మాజీ ప్రెసిడెంట్ కర్జాయ్, ఇతరులతో చర్చలు
- శాంతియుతంగా అధికార మార్పిడికి ప్రయత్నాలు
అఫ్గానిస్తాన్ మళ్లీ తాలిబాన్ల వశమైపోయింది. వారి దాడులను ఎదుర్కోలేక రాష్ట్రాల్లో ప్రభుత్వ బలగాలు చేతులెత్తేయడంతో అఫ్గాన్‌లో మళ్లీ తాలిబాన్ల రాజ్యం రావడం ఖాయమైపోయింది. తాలిబాన్ టెర్రరిస్టులు ఆదివారం దేశ రాజధాని కాబూల్‌లోకి ఎంటరయ్యారు. అఫ్గాన్ ప్రభుత్వం ఓటమి ముంగిట నిలవడంతో గత్యంతరం లేక అధ్యక్షుడు అష్రఫ్ ఘని తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయారు. అధ్యక్ష భవనానికి చేరుకున్న తాలిబాన్ ప్రతినిధులు.. మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అఫ్గాన్ నేషనల్ రీకాన్సిలియేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు అబ్దుల్లా అబ్దుల్లా, తదితర నేతలతో చర్చలు జరుపుతున్నారు. శాంతియుతంగా అధికార మార్పిడికి ప్రయత్నిస్తున్నామని ఆదివారం సాయంత్రం తాలిబాన్ ప్రతినిధులు ప్రకటించారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఉన్నఅఫ్గానిస్తాన్ను ఇస్లామిక్ ఎమిరేట్‌గా ప్రకటించి, అధికారం చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు తాలిబాన్ల అరాచక పాలనను తలచుకుని అఫ్గాన్ జనం బిక్కుబిక్కుమంటున్నారు. వేలాది మంది ఇరాన్, టర్కీ వంటి దేశాలకు వలసపోతున్నారు. కాబూల్ లో చిక్కుకున్న ఇండియన్లు, అధికారులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మళ్లీ తాలిబాన్ల రాజ్యం వచ్చేస్తోంది. మెరుపు దాడులతో దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబాన్లు కొత్త సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయమైపోయింది. వారం రోజులుగా అఫ్గాన్‌లోని ఒక్కో ప్రావిన్స్‌ను ఆక్రమించుకుంటూ వచ్చిన తాలిబాన్లు ఆదివారం దేశ రాజధాని కాబూల్‌లోకి ఎంటరయ్యారు. అఫ్గాన్ ప్రభుత్వం ఓటమి ముంగిట నిలవడంతో గత్యంతరం లేక ప్రెసిడెంట్ అష్రఫ్ ఘని రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయారు. అధ్యక్ష భవనానికి చేరుకున్న తాలిబాన్ ప్రతినిధులు.. మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, తదితర నేతలతో చర్చలు జరుపుతున్నారు. మొత్తంమీద.. అఫ్గాన్‌లో అధికార మార్పిడికి రంగం సిద్ధం అవుతోంది. శాంతియుతంగా అధికార మార్పిడికి ప్రయత్నిస్తున్నామని ఆదివారం సాయంత్రం తాలిబాన్ ప్రతినిధులు ప్రకటించారు. అమెరికా బలగాలు వెనక్కి వెళ్తుండటంతో మెరుపుదాడులు షురూ చేసిన తాలిబాన్లు.. కేవలం వారం రోజుల్లోనే దాదాపుగా దేశాన్నంతా తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. శనివారం నాటికి లోగర్, టెరాత్, కాందహార్ సహా 19కి పైగా ప్రావిన్స్ లను వరుసగా ఆక్రమించుకున్నారు. ఏకంగా దేశ రాజధాని కాబూల్ శివార్లలోకి చేరుకున్నారు. ఆదివారం మజర్ ఇ షరీఫ్, సెంట్రల్ బమియన్, తదితర ప్రావిన్స్ లను, బగ్రాం వద్ద ఉన్న యూఎస్ ఎయిర్ బేస్ ను స్వాధీనం చేసుకున్నారు. చివరగా కాబూల్‌లోకి ఎంటరయ్యారు.
హమీద్ కర్జాయ్‌తో తాలిబాన్ ల చర్చలు
శాంతియుతంగానే అధికార మార్పిడి జరిగేందుకు ఎదురు చూస్తున్నామని తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ఖతార్‌లో అల్ జజీరా టీవీ ద్వారా ప్రకటించారు. ప్రభుత్వం తరఫున మాజీ ప్రెసిడెంట్ హమీద్ కర్జాయ్, అఫ్గాన్ నేషనల్ రీకాన్సిలియేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు అబ్దుల్లా అబ్దుల్లా చర్చలు జరుపుతున్నట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి.
వారం రోజుల్లోనే..
అఫ్గాన్ నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఏప్రిల్ 14న ప్రకటించారు. ఆ తర్వాత మే 1 నుంచి బలగాల ఉపసంహరణ మొదలుకాగానే తాలిబాన్ మూకలు రెచ్చిపోయాయి. మెరుపువేగంతో దాడులు చేస్తూ వరుసగా ఒక్కో ప్రావిన్స్‌ను హస్తగతం చేసుకున్నారు. వారం రోజుల్లోనే అన్ని ప్రావిన్స్ లను ఆక్రమించుకుని దేశ రాజధాని కాబూల్‌లోకి ఎంటరయ్యారు.
తజకిస్తాన్‌కు అష్రఫ్ ఘని
తాలిబాన్లు కాబూల్‌లోకి ఎంటరవడంతో అఫ్గానిస్తాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘని దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారని అఫ్గాన్ నేషనల్ రీకాన్సిలియేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు అబ్దుల్లా అబ్దుల్లా ప్రకటించారు.
పాక్ దే అసలు పాపం
అఫ్గాన్ ను 1990లలో చేజిక్కించుకున్న తాలిబాన్ లకు అమెరికా బలగాల రాకతో చుక్కెదురైంది. 2001 నాటికి తాలిబాన్ల చెర వీడింది. అప్పటి నుంచి ఇరవై ఏండ్లుగా తాలిబాన్లు నామమాత్రంగా మిగిలారు. అయితే తాలిబాన్లకు ఇటు షెల్టర్ ఇస్తూ.. అటూ ట్రెయినింగ్, ఆయుధాలు అందిస్తూ పరోక్షంగా పాకిస్తానే ఇన్నేండ్లుగా వాళ్లను పెంచి పోషించిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏటీఎంల ముందు జనం బారులు
మళ్లీ తాలిబాన్ల అరాచక పాలనలో మగ్గిపోవాల్సి వస్తుందని అఫ్గాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంల ముందు బారులు తీరారు. భయాందోళనలతో చాలామంది ఇరాన్ మీదుగా టర్కీకి వలసపోతున్నరు. అయితే, అఫ్గాన్‌లో తమ ప్రభుత్వంలోనూ మహిళల హక్కులను అనుమతిస్తామని తాలిబాన్ ప్రతినిధులు ప్రకటించారు. మహిళలు చదువుకోవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని, అయితే హిజబ్ మాత్రం ధరించాల్సిందేనని తాలిబాన్ ప్రతినిధులు చెప్పారు.
ఎయిరిండియా ఫ్లైట్ గంటసేపు చక్కర్లు
ఢిల్లీ నుంచి 40 మంది ప్యాసింజర్లతో ఆదివారం మధ్యాహ్నం కాబూల్ వెళ్లిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ కు అనుమతి రాకపోవడంతో దాదాపు గంటసేపు కాబూల్ ఎయిర్ పోర్టు చుట్టూ గాలిలోనే చక్కర్లు కొట్టింది.
ఏ రోజు ఏం జరిగింది..
ఏప్రిల్ 14 : అఫ్గానిస్తాన్ నుంచి యూఎస్ ట్రూప్స్ వెనక్కి రావాలని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆదేశించారు. సెప్టెంబర్ 11 తో బలగాల తిరుగు ప్రయాణం ముగుస్తుంది.
మే 4: సదరన్ హెల్మాండ్ ప్రావిన్స్‌లోని అఫ్గాన్ దళాలపై తాలిబాన్లు దాడి చేశారు.
మే 11: దేశంలో హింస పెరిగిపోవడంతో కాబూల్‌కు పక్కనే ఉన్న నెర్క్ జిల్లాను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు.
జులై 2: అఫ్గానిస్తాన్ బగ్రామ్ ఎయిర్ బేస్‌లోని మెయిన్ మిలిటరీ బేస్ నుంచి అమెరికా దళాలు బయటికి వచ్చేశాయి.
జులై 5: ఆగస్టులోగా అఫ్గాన్ ప్రభుత్వానికి శాంతి ప్రతిపాదన పంపించే చాన్స్ ఉందని తాలిబాన్లు చెప్పారు.
జులై 21: దేశంలోని సగానికి పైగా జిల్లాలను తాలిబాన్ తిరుగుబాటుదారులు ఆక్రమిస్తారని యూఎస్ జనరల్ అన్నారు.
జులై 26: మే, జూన్ నెలల్లో జరిగిన హింసలో సుమారు 2,400 మంది అఫ్గాన్ పౌరులు చనిపోయి లేదా గాయపడి ఉంటారని యునైటెడ్ నేషన్ చెప్పింది.
ఆగస్టు 6: తాలిబాన్లు ఆక్రమించుకున్న ఫస్ట్ ప్రావిన్షియల్ రాజధాని సౌత్‌లోని జరాంజ్
ఆగస్టు 13: ఆధ్యాత్మిక నిలయమైన కాందహార్ సహా 4 ప్రావిన్షియల్స్‌ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు.
ఆగస్టు 14: మజారి షరీఫ్, కాబూల్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోగర్ ప్రావిన్స్ రాజధాని పుల్ ఇ ఆలంను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 15: ఎటువంటి పోరాటం చేయకుండానే జలాలాబాద్‌ను ఆక్రమించుకున్న తాలిబాన్లు కాబూల్‌ను చుట్టుముట్టారు.
ఆగస్టు 15: తాలిబాన్ తిరుగుబాటుదారులు కాబూల్‌లోకి ఎంటర్ అయ్యారని, ఎంబసీ నుంచి హెలికాప్టర్ ద్వారా తమ దౌత్యవేత్తలను అమెరికా తరలించిందని ఇంటర్నల్ మినిస్ట్రీ అధికారి చెప్పారు.
ఎంబసీలు ఖాళీ చేస్తున్న దేశాలు
కాబూల్‌లోని యూఎస్ ఎంబసీ నుంచి సిబ్బంది హెలికాప్టర్లలో తరలి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎంబసీ నుంచి పెద్ద ఎత్తున పొగలు కన్పించాయి. కీలక పత్రాలను సిబ్బంది తగలబెట్టి వెళ్లినట్లు మీడియా తెలిపింది. జర్మనీ, కెనడా, స్పెయిన్ ఇతర దేశాలు కూడా తమ ఎంబసీలను ఖాళీ చేసి, సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నాయి. కాగా, కాబూల్ లో చిక్కుకున్న వందలాది మంది ఇండియన్లు, అధికారులను వెనక్కి రప్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.