- తొలి సెమీస్‌లో సౌతాఫ్రికాతో అఫ్గానిస్తాన్ ఢీ
- ఎవరు గెలిచినా చరిత్రే
తరౌబా (ట్రినిడాడ్) : టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిన సౌతాఫ్రికా, సంచలనాలు నమోదు చేస్తూ అనూహ్యంగా దూసుకొచ్చిన అఫ్గానిస్తాన్ గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సఫారీ జట్టు పదేండ్ల తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరగా.. అఫ్గాన్ మొదటిసారి ఇంతదూరం వచ్చింది. ఇద్దరిలో ఎవ్వరు గెలిచినా తొలిసారి ఫైనల్ చేరి చరిత్ర సృష్టించనున్నారు. బలాబలాలను చూస్తే సఫారీలనే ఫేవరెట్లు అనొచ్చు.
పేపర్‌పై ఆ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఓడించి గత పోరులో బంగ్లాపై హిస్టారికల్ విక్టరీ సాధించిన అఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. పైగా ఈ టోర్నీలో ఇంత దూరం రావడమే రషీద్ సేనకు గొప్ప విషయం. సెమీస్‌లో ఓడినా గర్వంగా ఇంటికి వెళ్లొచ్చు కాబట్టి ఆ టీమ్ స్వేచ్ఛగా ఆడనుంది. కెప్టెన్ రషీద్ ఖాన్ ఆ టీమ్ ప్రధాన అస్త్రం కాగా ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, పేసర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫారూఖీ ఈసారి కూడా కీలకం కానున్నారు.
ఇంకోవైపు ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సఫారీలు ఇప్పటిదాకా టీ20 లేదా వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరింది లేదు. మెగా టోర్నీల్లో ఆ టీమ్‌ను నాకౌట్ ఫోబియా వెంటాడుతోంది. ఈసారైనా ఆ ఫోబియా నుంచి బయటపడి కప్పు నెగ్గాలని మార్‌క్రమ్ కెప్టెన్సీలోని సౌతాఫ్రికా కోరుకుంటోంది. కానీ, డికాక్, మార్‌క్రమ్, మిల్లర్, క్లాసెన్, స్టబ్స్ వంటి హిట్లర్లు ఉన్నా సఫారీలు బ్యాటింగ్‌లో తడబడతున్నారు.
అఫ్గాన్ బౌలింగ్ పదునుగా ఉన్న నేపథ్యంలో బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ జరిగే తరౌబా వికెట్ బౌలింగ్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో మరోసారి బౌలర్లు కీలక పాత్ర పోషించనున్నారు.