ZIM vs AFG: రషీద్ ఖాన్‌కు 11 వికెట్లు.. జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం

ZIM vs AFG: రషీద్ ఖాన్‌కు 11 వికెట్లు.. జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఫార్మాట్ ఏదైనా వికెట్స్ తీయడానికి ముందుంటాడు. బులవాయో వేదికగా జింబాబ్వేతో  క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన మ్యాచ్ లో ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ చెలరేగిపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 11 వికెట్లు తీసి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో సత్తా చాటిన అతను.. రెండో ఇన్నింగ్స్ లో మరింతగా చెలరేగి 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రషీద్ ఖాన్ విజృంభణతో రెండో టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ 72 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 

278 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వస్తుంది. సీనియర్ ప్లేయర్లు సికిందర్ రాజా(38), ఎర్విన్ (53) ఐదో వికెట్ కు 58 పరుగులు జోడించి గెలుపుపై ఆశలు చిగురించేలా చేసినా రషీద్ ఖాన్ ధాటికి జింబాబ్వే ఒక్కసారిగా కుప్పకూలింది. రాజాను ఔట్ చేసి బాగాస్వయాన్ని బ్రేక్ చేసిన రషీద్ ఖాన్.. ఆ తర్వాత సీన్ విలియమ్స్ (16), బెన్నెట్ (0) లను ఔట్ చేసి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ వైపు తిప్పాడు. 

8 వికెట్ల నష్టానికి 205 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన జింబాబ్వే అదే స్కోర్ వద్ద చివరి రెండు వికెట్లను కోల్పోయింది. అంగరవా రనౌట్ రూపంలో వెనుదిరగగా.. ఎర్విన్ 53 పరుగులతో ఒంటరి పోరాటం చేసి చివరి వికెట్ గా ఔటయ్యాడు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. రషీద్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. రహ్మత్ షా కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.