Champions Trophy 2025: ఇంగ్లాండ్‌పై సంచలన విజయం..ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం

Champions Trophy 2025: ఇంగ్లాండ్‌పై సంచలన విజయం..ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. పటిష్టమైన ఇంగ్లాండ్ ను బోల్తా కొట్టించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. లాహోర్ వేదికగా ఇంగ్లాండ్ పై తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఒత్తిడిలో అద్భుతంగా రాణించిన ఆఫ్ఘనిస్తాన్ గెలుపును అందుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్  నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ తరపున రూట్ సెంచరీ (111 బంతుల్లో 120: 11 ఫోర్లు, ఒక సిక్సర్) చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ ఫలితంతో వరుసగా రెండు ఓటములతో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఆఫ్ఘనిస్థాన్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుని సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.    

326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఆరంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. సాల్ట్ (12), జెమీ స్మిత్ (9) త్వరగానే ఔటయ్యారు. దీంతో 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రూట్, డకెట్ ఇంగ్లాండ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్ కు 68 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. డకెట్(38), బ్రూక్(25) వెంటవెంటనే ఔట్ కావడంతో ఇంగ్లాండ్ 136 పరుగులకే నాలుగుకు వికెట్లు కోల్పోయి మరోసారి ఇబ్బందుల్లో పడింది. అప్పటికే క్రీజ్ లో పాతుకుపోయిన రూట్ కెప్టెన్ బట్లర్ తో కలిస్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం వైపు బాటలు వేశారు. 

బట్లర్(38), లివింగ్ స్టోన్(10) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో భారమంతా సీనియర్ ఆటగాడు రూట్ పై పడింది. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా రూట్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గెలుపు ఖాయమన్న దశలో రూట్ ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివర్లో ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ ఓవర్ టన్(32), జోఫ్రా ఆర్చర్(13) పోరాడైనా ఫలితం లేకుండా పోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అజమాతుల్లా ఓమర్జాయ్ 5 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ నబీ రెండు వికెట్లు తీసుకోగా.. నైబ్, ఫరూఖీ, రషీద్ ఖాన్ లకు తలో వికెట్ లభించింది. 

అంతకముందు ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(146 బంతుల్లో 177: 12 ఫోర్లు, 6 సిక్సర్లు)ఆకాశమే హద్దుగా  చెలరేగి భారీ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓమర్జాయ్(41), షాహిదీ(40), నబీ (40) కీలక ఇన్నింగ్స్ ఆడారు.  ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, ఓవర్ టన్ లకు తలో వికెట్ లభించింది.