- గోదావరిఖనికి చెందిన ప్యాసింజర్ బ్యాగ్ చోరీ
- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగ అరెస్ట్
- 15 తులాల బంగారం,22 తులాల వెండి రికవరీ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సులో బ్యాగ్స్ చోరీకి పాల్పడుతున్న పాత నేరస్తున్ని అఫ్జల్‌గంజ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌చేశారు. రూ.11 లక్షల విలువ చేసే15 తులాల బంగారం, 22 తులాల వెండి ఆభరణాలు, రూ.10 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కి తరలించారు. సరూర్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ సోదరి సరిత హెల్త్ చెకప్ కోసం గత నెలలో గోదావరిఖని నుంచి హైదరాబాద్ వచ్చింది. 23వ తేదీన ఎమ్‌జీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులో గోదావరిఖనికి తిరుగు ప్రయాణం అయ్యింది.
బస్సులో కూర్చుని కింద ఉన్న తన సోదరుడితో మాట్లాడుతున్నది. అదే సమయంలో మేడ్చల్ జిల్లా బొల్లరానికి చెందిన కంది సంపత్ రెడ్డి(48) ఆమె బ్యాగ్‌ను చోరీ చేశాడు. బస్సు కదిలేలోగా బ్యాగ్‌తో సహా ఉడాయించాడు. ఇంటికి వెళ్లిన తరువాత సరిత తన బ్యాగ్ కోసం వెతికింది. కనిపించకపోవడంతో హైదరాబాద్‌లోని తన సోదరుడు శ్రీకాంత్‌కు సమాచారం అందించింది. శ్రీకాంత్ అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఎమ్‌జీబీఎస్‌లో బస్సు ఆగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లు చెక్ చేశారు. బస్సు నుంచి దిగిపోయిన సంపత్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ చేసిన నగలను సంపత్ బేగంబజార్‌లోని గోల్డ్‌స్మిత్ రమేశ్ కి విక్రయించిన్టటు గుర్తించారు. పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించారు.