12 ఏండ్ల తర్వాత.. గుట్ట ఆలయంలో ట్రాన్స్​ఫర్లు 

  •      దేవస్థానంలో 278 మంది ఉద్యోగులు
  •     బదిలీ కానున్న 89 మంది  
  •     అర్చకులూ వెళ్లవల్సిందే... ?

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 12 ఏండ్ల తర్వాత ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలైంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఎండోమెంట్ శాఖ జీవో నంబర్ 243 జారీ చేసింది. బదిలీలకు సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ చేసి ఈ నెల 29 లోపు ట్రాన్స్​ఫర్స్​ పూర్తి చేయనుంది. ఈ జీవో ప్రకారం..ఆలయాల్లో సర్వీసులో ఉన్న ఉద్యోగుల్లో 40 శాతం మందిని బదిలీ చేయనున్నారు. 

ఆ 55 మందికి వర్తించదు..

యాదగిరిగుట్ట దేవస్థానంలో 278 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 91 మంది మినిస్టీరియల్ స్టాఫ్ కాగా..98 మంది మతపరమైన సిబ్బంది, 89 మంది నాలుగో తరగతి ఉద్యోగులున్నారు. వీరిలో ఏడాది లోపు ఉద్యోగ విరమణ చేసే సిబ్బంది ఏడుగురు ఉండగా, నాలుగేళ్ల సర్వీస్ నిండని ఉద్యోగులు 48 మంది ఉన్నారు. జీవో గైడ్ లైన్స్ ప్రకారం ఈ 55 మందికి బదిలీలు వర్తించవు. ఈసారి అర్చకులు కూడా బదిలీ అవుతారని తెలుస్తోంది. బదిలీ అవకాశాలున్న 223 మందిలో దాదాపు 89 మంది ఉద్యోగులు ఇతర ఆలయాలకు వెళ్లనున్నారు. 

మినిస్టీరియల్ స్టాఫ్ నుంచి 36 మంది..మతపరమైన సిబ్బంది 39 మంది,  ఫోర్త్ క్లాస్ సిబ్బంది నుంచి 35 మంది బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఈ నెల 15 నుంచి 19 వరకు ఏ ఆలయానికి బదిలీపై వెళ్తారో ఎంచుకోవడానికి ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. దరఖాస్తు ఫారాలు కూడా ఉద్యోగులకు ఇప్పటికే అందాయి. ప్రభుత్వం ఈ నెల 28 నుంచి 29 లోపు ఉద్యోగులకు ట్రాన్స్​ఫర్స్​ ఆర్డర్స్ జారీ చేయనుంది. ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు.. మూడు రోజుల్లోపు బదిలీ అయిన ఆలయంలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.  

రాష్ట్రం ఏర్పడ్డాక గుట్టలో తొలిసారి.. 

యాదగిరిగుట్ట ఆలయంలో చివరిసారిగా 2011--–12 మధ్యలో ఈవోగా ప్రేమ్ కుమార్ ఉన్న టైంలో బదిలీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు బదిలీలు జరగలేదు. దాదాపుగా 12 ఏండ్ల తర్వాత  ట్రాన్స్​ఫర్స్​ జరుగుతుండడంతో ఆలయ ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది.  

భద్రాచలంలో బదిలీల వివాదం హైకోర్టును ఆశ్రయించిన రామాలయ అర్చకులు 

భద్రాచలం: జీవో 243 ప్రకారం ఎండోమెంట్ ​ఆఫీసర్లు అర్చకులకు కూడా ఆప్షన్ ​పత్రాలు ఇవ్వడం భద్రాచలంలో వివాదానికి కారణమైంది. అనువంశికంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామదాసు కాలంలో శ్రీరంగం నుంచి వచ్చిన అమరవాది, కోటి, పొడిచేటి, తూరుగోటి, గొట్టిపుల్ల తదితర అర్చక కుటుంబాలు బదిలీలను వ్యతిరేకిస్తున్నాయి.

 ఈ మేరకు శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు సోమవారం హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. శ్రీసీతారామచంద్రస్వామికి వంశపారంపర్యంగా ఈ గోత్ర నామాలకు చెందిన అర్చకులే పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని, బదిలీలను ఆపాలంటూ వారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు ఖమ్మంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు.