16 ఏండ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..

  • తెలిసీ తెలియని వయసులో యూపీ నుంచి తెలంగాణకు.. 
     
  • బేకరీ యజమాని చొరవతో పేరెంట్స్​ దగ్గరకు.. 
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన

బెల్లంపల్లి, వెలుగు: తెలిసీ తెలియని వయస్సులో పని కోసం ముంబైకి వెళ్లి, ఆ తర్వాత ఓ బేకరీలో పని చేసిన యువకుడు 16 ఏండ్ల తర్వాత తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. ఈ అరుదైన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాపూర్ జిల్లా మహ్మదాబాద్ తహసీల్ యూసుఫ్​పూర్​ గ్రామానికి చెందిన మున్నా కుమార్ బింద్, సంత్రా దేవి దంపతులకు నలుగురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు మహేందర్ కుమార్ తెలిసీ తెలియని వయసులో పని కోసం తన బంధువుతో కలిసి ముంబై వెళ్లాడు. అక్కడ ఓ టీ స్టాల్ లో పనిచేస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్​కే చెందిన శివ కుమార్ యాదవ్ తో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తర్వాత వీరిద్దరూ కలిసి పని కోసం బెల్లంపల్లికి వచ్చి మనీషా బేకరీలో పనికి కుదిరారు. ఇలా 16 ఏండ్లు గడిచిపోయాయి. మహేందర్​ తల్లిదండ్రులు, స్వగ్రామాన్ని కూడా మర్చిపోయాడు. 

ఈ క్రమంలోనే తల్లిదండ్రుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. వారి గురించి తెలుసుకోవాలనుకుని బేకరీ యజమాని సుశీల్ కుమార్ కు విషయం చెప్పాడు. దీంతో అతడు యూపీలో ఉంటున్న తన బంధువైన ఓ కానిస్టేబుల్​కు సమాచామిచ్చాడు. ఎంక్వైరీ చేసిన ఆ కానిస్టేబుల్ అతడి తల్లిదండ్రుల వివరాలు సేకరించి తెలియజేశాడు.  దీంతో వారు బెల్లంపల్లికి చేరుకొని కొడుకును కలుసుకున్నారు. చిన్ననాడు గొంతు కింద ఆపరేషన్ చేయగా ఏర్పడ్డ మచ్చను చూసి గుర్తు పట్టి సంబురపడిపోయారు. మహేందర్​ను తీసుకొని తమ  గ్రామానికి బయలుదేరివెళ్లారు.