- సంబురంగా ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణం
హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు 31 నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తన ఫ్యామిలీని అవమానించడంతో సీఎంగానే మళ్లీ అసెంబ్లీకి వస్తానని 2021, నవంబర్ 19న ఆయన శపథం చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కాలేదు. శుక్రవారం సీఎం హోదాలో సుమారు రెండున్నరేండ్ల తర్వాత అసెంబ్లీ మెట్లకు మొక్కి లోపలికి అడుగుపెట్టారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, కొండబాబు అసెంబ్లీకి హాజరుకాలేదు.
ముందుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వైసీపీ చీఫ్ జగన్ కూడా తన పది మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేశారు. తర్వాత సభను ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య శనివారానికి వాయిదా వేశారు.
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ మూడు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రానికి నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఒకటే నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు అయ్యన్నపాత్రుడిని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టనున్నారు.