- కాకతీయ మహారాజు.. వేంచేస్తున్నారహో
- 700 ఏండ్ల తర్వాత ఓరుగల్లుకు కాకతీయుల వారసుడు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు చరిత్రలో గురువారం సరికొత్త ఘట్టం ఆవిష్కృతం కానుంది. 700 ఏండ్ల తర్వాత కాకతీయుల వారసుడు.. నాడు వాళ్ల రాజధాని అయిన ఖిలా వరంగల్‌లో అడుగు పెట్టనున్నారు. రాష్ట్ర సర్కార్ కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాకతీయుల 22వ వారసుడు చత్తీస్‍గఢ్ రాష్ట్రం బస్తర్ మహారాజ్ కమల్‍చంద్ర భంజ్‍దేవ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. కమల్ చంద్ర ఉదయం భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి, వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా ఖిలా వరంగల్ వెళ్తారు. అక్కడ ఉత్సవాలను ప్రారంభిస్తారు. 13న రామప్ప ఆలయంలో జరిగే కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. రాజకుటుంబీకుల రాకతో పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
జిగేల్ మనేలా లైటింగ్...
కమల్‍చంద్రకు స్వాగతం పలికేందుకు లోకల్ ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్ పోటీ పడి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన భద్రకాళి ఆలయానికి వచ్చే టైమ్‌లో 611 మంది పేరిణి, ఇతర కళాకారులతో స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి అశ్వక దళ రథం ( 16 గుర్రాల బండి), 100 మంది సైనికులతో ర్యాలీగా కోట వద్దకు తీసుకెళ్తారు. కోట వద్ద 700 మంది పేరిణి, ఒగ్గు డోలు కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మహిళలు బోనాలు తీసుకొస్తారు. జంక్షన్ల వద్ద మొక్కలు, లైటింగ్ పెట్టారు. కోట, మెట్ల బావి, ఖుష్ మహాల్, వెయ్యిస్తంభాల గుడి, అగ్గిలయ్య గుట్ట, హరిత హోటల్ వద్ద కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆయాచోట్ల రంగురంగుల లైటింగ్ ఏర్పాటు చేశారు. కాగా, బుధవారం ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ లో గుర్రపు బండి రిహార్సల్స్ చేశారు. ఈ క్రమంలో అవి వినకపోవడంతో వారిలో టెన్షన్ నెలకొంది.
హోర్డింగుల్లో మహారాజ్ ఫొటోల్లేవ్...
రాష్ట్ర సర్కార్ తరఫున గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు జంక్షన్లలో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. కానీ వీటిలో ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న మహారాజ్ కమల్ చంద్ర ఫొటోనే లేదు. కేవలం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‍గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఉత్సవాలు అధికారికంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలా వరంగల్ లో ప్రారంభిస్తుండగా, లోకల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఫొటో కూడా పెట్టలేదు. ఇతర జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫొటోలూ లేవు. ఇది సర్కార్ ప్రోగ్రాం అయినప్పటికీ, వినయ్ భాస్కర్ సొంత ప్రోగ్రామ్ లా ఉందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వారం జరిగే కార్యక్రమాలు ఇవీ..
7వ తేదీ: ఖిలా వరంగల్‌లో ఉత్సవాలు ప్రారంభం. భద్రకాళి, వెయ్యి స్తంభాల ఆలయంలో మహారాజు పూజలు. హనుమకొండలోని అగ్గిలయ్య గుట్ట సందర్శన, హరిత హోటల్లో లంచ్. అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్తారు. సాయంత్రం 7 గంటలకు మాదాపూర్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం.
8: ఉదయం హనుమకొండ అంబేద్కర్ భవన్‍లో కవి సమ్మేళనం, హనుమకొండ పబ్లిక్ గార్డెన్‍లోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో నాటకాలు, ఖిలా వరంగల్ ఖుష్‌మహల్ లో క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్సులు.
9, 10: సాయంత్రం భద్రకాళి బండ్‍లో ఫుడ్ ఫెస్టివల్.
10 నుంచి 13 వరకు: ఉదయం రీజినల్ సైన్స్ సెంటర్ లో పెయింటింగ్ వర్క్ షాప్.
11: ఉదయం రీజినల్ సైన్స్ సెంటర్లో సినీ వారం ప్రివ్యూ థియేటర్ ప్రారంభం, పనగాళ్లు టెంపుల్ విజిట్.
12: ఉదయం ఎన్‍ఐటీలో మిషన్ కాకతీయ, కాకతీయ ఐడియాలజీపై సెమినార్.
13: సాయంత్రం రామప్ప ఆలయంలో ముగింపు కార్యక్రమాలు.