ఆరేళ్ల తర్వాత నేడు ఏపీ ఫార్మేషన్ డే

ఆరేళ్ల తర్వాత నేడు ఏపీ ఫార్మేషన్ డే

విజయవాడలో వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్, సీఎం

అమరావతి, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీ సర్కారు తొలిసారి రాష్ర్ట అవతరణ వేడుకలను శుక్రవారం నిర్వహించనుంది. 2014లో రాష్ర్ట విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు. అప్పటి సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు చేపట్టడంతో ఏపీ అవతరణ దినోత్సవం మరుగున పడిపోయింది. విభజన తేదీని అవతరణ దినోత్సవంగా పరిగణించాలా లేక ఉమ్మడి ఏపీ అవతరణ దినోత్సవాన్ని కొనసాగించాలా అని కేంద్ర హోం శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఉమ్మడి ఏపీ అవతరణ దినోత్సవాన్నే కొనసాగించాలని కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు రావడంతో ఆరేళ్ల తర్వాత వేడుకలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే వేడుకల్లో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబసభ్యులు, బంధువులను సత్కరించనున్నారు. మూడురోజులపాటు జరిగే వేడుకల్లో మొదటి రోజు హస్తకళలు, చేనేత కళల ప్రదర్శన నిర్వహిస్తారు. రెండోరోజు కూచిపూడి, లలిత, జానపద కళలు, సురభి నాటకాలు ప్రదర్శిస్తారు. మూడో రోజు తెలుగు సంప్రదాయలు, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుంది.

After a gap of 5 years, Andhra to celebrate its formation day on Friday