మూసీ నదిపై కొత్తగా 14 బ్రిడ్జిలు కడతాం: మంత్రి కేటీఆర్

మూసీ నదిపై కొత్తగా 14 బ్రిడ్జిలు కడతాం: మంత్రి కేటీఆర్

ఎల్బీ నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెట్రోను హయత్ నగర్ వరకూ విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మెట్రో రెండో విడతలో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు 5 కి.మీ. మేరకు నిర్మాణం చేపడతామన్నారు. ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో రూ. 55 కోట్లతో చేపట్టిన ఐదు అభివృద్ధి పనులను మంగళవారం మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు ఎస్ఎన్డీపీ ద్వారా రూ. 7.26 కోట్ల వ్యయంతో చేపట్టిన నాలాను మంత్రి ఓపెన్ చేశారు. ఫతుల్లాగూడ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి వయా మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు మీదుగా పిర్జాదీగూడ వరకు రూ. 26.50 కోట్ల వ్యయంతో చేపట్టిన లింక్ రోడ్డును, ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో రూ. 84 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల శ్మశానవాటికను, రూ. 16.25 కోట్లతో నిర్మించిన హిందూ, క్రిస్టియన్ శ్మశాన వాటికలు, ముస్లింల ఖబ్రస్తాన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌‌ఎన్‌‌డీపీ) పథకం కింద జీహెచ్‌‌ఎంసీ పరిధిలో రూ. 985 కోట్లతో 56 పనులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు రెండు పనులు (పికెట్ నాలాపై బ్రిడ్జి, బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు నాలా) పూర్తి చేశామన్నారు. ఈ నెల చివరి నాటికి 17 పనులు, జనవరి చివరి నాటికి మరో15 పనులు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హుస్సేన్‌‌ సాగర్‌‌ సర్ఫేస్‌‌ నాలా, బల్కాపూర్‌‌ నాలా ఎండాకాలం వరకు పూర్తి చేస్తామన్నారు. 

మూసీపై కొత్త బ్రిడ్జిలు..

మూసీపై కొత్తగా జీహెచ్ఎంసీ ద్వారా14 వంతెనలను నిర్మించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల మున్సిపాలిటీలలో రూ. 240 కోట్లతో 21 పనులు చేపట్టామన్నారు. ఫతుల్లాగూడ నుంచి ఫిర్జాదిగూడ వరకు చేపట్టిన రోడ్డును వరంగల్ నేషనల్ హైవేకు, ఓఆర్ఆర్ కు లింక్ చేసేందుకు రూ. 34 కోట్లతో రోడ్డును, రూ. 52 కోట్లతో మూసీపై వంతెనను నిర్మిస్తున్నామన్నారు. ఆటోనగర్ లోని ఖాళీ స్థలంలో ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేస్తామన్నారు.