ముంబై: కోటిన్నర విలువైన వజ్రాలను చోరీ చేసిన జ్యువెలరీ షోరూం ఎంప్లాయిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి చోరీకి గురైన మెజార్టీ వస్తువులను రికవరీ చేశారు. కిరణ్రతీలాల్ రోకానీ అనే వ్యాపారి గోరేగావ్ లో ఓ షోరూంని నిర్వహించేవారు. అతడి వద్ద సచిన్ జె. మక్వానా వర్క్ చేస్తుండేవాడు.
తన షోరూం నుంచి డిసెంబర్10న రూ.1.47 కోట్ల విలువైన వజ్రాలను మక్వానా చోరీ చేశాడని కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు120 సీసీటీవీ కెమెరాలను చెక్ చేసి నిందితుడి ఆచూకీని గుర్తించారు. గోరేగావ్ తో పాటు మలాద్, దహిసర్, చారోటీ టోల్, భిలాడ్, వాపి, సూరత్, అహ్మదాబాద్, పలన్ పుర్, ఇదార్ లలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించి మంగళవారం అతడిని అరెస్టు చేశారు. నేరాన్ని నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు.
చోరీచేసిన వస్తువుల్లో దాదాపు 97శాతం మేర రికవరీ చేశామని తెలిపారు. అతడి నుంచి రూ.77,380 నగదుతో పాటు రూ.1.40 కోట్ల విలువైన డైమండ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తును కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.