బంగ్లాదేశ్​లో మరో హిందూ లీడర్ అరెస్ట్

  • చిన్మయ్ కృష్ణదాస్​ను కలిసేందుకు జైలుకు వెళ్లిన శ్యామ్ దాస్ ప్రభు
  • వారెంట్ లేకున్నా అదుపులోకి..మరో 3 టెంపుల్స్ పైనా దాడులు 
  • ఇస్కాన్ కోల్​కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ వెల్లడి

ఢాకా: బంగ్లాదేశ్​లో మరో హిందూ లీడర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛట్టోగ్రామ్ జైలులో ఉన్న హిందూ లీడర్ చిన్మయ్ కృష్ణదాస్​ను కలిసేందుకు వెళ్లిన ఇస్కాన్ సభ్యుడు శ్యామ్ దాస్ ప్రభును పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారని ఇస్కాన్ కోల్ కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ శుక్రవారం రాత్రి వెల్లడించారు. బంగ్లాదేశ్​లో హిందూ మైనార్టీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన ట్విట్టర్​లో ఆందోళన వ్యక్తం చేశారు. 

‘‘ఇస్కాన్ సభ్యుడు శ్యామ్ దాస్ ప్రభు ఏమైనా టెర్రరిస్ట్​లా కన్పిస్తున్నారా? ఇస్కాన్​కు చెందిన అమాయక బ్రహ్మచారీల(మెంబర్స్) అరెస్ట్​లు తీవ్ర దిగ్ర్భాంతిని కలిగిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే హిందూ లీడర్లను రిలీజ్ చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. భైరబ్ లోని ఇస్కాన్ సెంటర్ పైనా శుక్రవారం దుండగులు దాడి చేశారని రాధారమణ్ దాస్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతోపాటు మరో మూడు హిందూ టెంపుల్స్ పైనా దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారన్నారు.

బంగ్లాదేశ్​లో హిందువులకు భద్రత కల్పించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, శ్యామ్ దాస్ ప్రభు అరెస్ట్​పై బంగ్లాదేశ్ పోలీసుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కాగా, శుక్రవారం ఛట్టోగ్రామ్​లోని శాంతనేశ్వరి మాత్రి టెంపుల్, షోనీ టెంపుల్, శాంతనేశ్వరి కాళీబరి టెంపుల్ పై వందలాది మంది మతపరమైన నినాదాలు చేస్తూ దాడులు చేసినట్టు బీడీన్యూస్24.కామ్ వెల్లడించింది.