అధికారంలోకి వచ్చిన..తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు : భట్టి విక్రమార్క

అధికారంలోకి వచ్చిన..తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

సూర్యాపేట, వెలుగు : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులను భర్తీ చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం కొండలరాయిని గూడెం, మున్యా నాయక్ తండా, కర్వినాగారం, రావి తండా, పాండ్యా నాయక్ తండాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అర్హులకు రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు.

ALSO READ:సబ్జెక్ట్​ టీచర్ల డిప్యూటేషన్లు ఎప్పుడు..

ఉపాధి, నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో ఉండే ఇద్దరు వృద్ధులకు పింఛన్​, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. మున్యానాయక్​ తండాలో రోడ్డు పక్కన మహిళలు తయారుచేసిన రొట్టెలను తిన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న పాల్గొన్నారు.