అనాగరిక భూసేకరణ పద్ధతి పోవాల్సిందే

దేశవ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాల తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం బలవంతపు భూ సేకరణను ఆపడానికి 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ దాన్ని పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. రకరకాల పద్ధతుల్లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 2013 భూసేకరణ చట్టాన్ని బలహీనంగా మార్చాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2013 చట్టాన్ని పక్కన పెట్టి 124 జీవో ప్రకారం భూసేకరణ ప్రారంభించింది. జీవో ప్రకారం ఎవరైనా రైతు ప్రభుత్వానికి భూమి ఇవ్వడానికి సిద్ధపడితే సదరు రైతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని అట్టి భూమిని హస్తగతం చేసుకోవచ్చు. అయితే ఏ రైతు కూడా భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడని అందరికీ తెలిసిందే. ప్రభుత్వమే బలవంతం చేసి రైతు భూమిని లాక్కుంటోంది. రైతుపై ఒత్తిడి తీసుకువచ్చి సంతకం తీసుకుంటారు. నియంతృత్వంగా ఉన్న ఈ జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరించ రాదని, రాజ్యాంగం ప్రకారం రైతుల సంక్షేమం చూడాలని పేర్కొంది. చట్టం ఉండగా జీవో ద్వారా భూసేకరణ చేయరాదని కోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర సర్కారు 2013 చట్టాన్ని సవరించింది. అభివృద్ధి ప్రాజెక్టుల అవసరాన్ని బాధితులు మూల్యాంకనం చేసే అవకాశాన్ని తొలగించింది. 123 జీవోను 2013 చట్టంలో భాగం చేసింది. ఒత్తిడి తెచ్చి ఒప్పందం చేసుకునే అవకాశానికి చట్టబద్ధత కల్పించింది. సవరించిన చట్టాలను వాడుకొని అన్యాయమైన పద్ధతుల్లో ప్రభుత్వం పేద రైతుల భూమి లాక్కుంటోంది. అయితే ప్రభుత్వ ఒత్తిడికి లొంగి భూమిని అప్పగిస్తున్నట్టు సంతకం చేయకపోతే  చట్టం ఇచ్చిన కొన్ని రక్షణలను  రైతు ఉపయోగించుకోవచ్చు. తన భూమిని కాపాడుకోవచ్చు. అయితే బయటి నుంచి మద్దతు లేకుండా ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకొని నిలబడటం సాధారణ రైతుకు సాధ్యం కావడం లేదు. 

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా..

భూసేకరణ చేయాలని నిర్ణయించిన తర్వాత రైతులను మోసం చేసి, మభ్యపెట్టి భూములు లాక్కుంటున్నారు. సర్వే విషయం రైతులకు చెప్పరు. వారికి సమాచారం ఇవ్వకుండానే, వీలైతే రహస్యంగా సర్వే చేస్తారు. రైతులు సర్వేను అడ్డుకుంటే పోలీసులను రంగంలోకి దింపుతారు. ముఖ్య నాయకులు సహా అందరినీ అరెస్టు చేసి సర్వే చేసే ప్రయత్నం చేస్తారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు విషయంలో కేవలం అంచనా కోసమని చెబితే రైతులు సర్వేకు ఒప్పుకున్నారు. తీరా సర్వే పూర్తి చేసిన తర్వాత దాని ఆధారంగా భూ సేకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఒక ప్రహసనంగానే సాగుతున్నది. సమాచారం ఆలస్యంగా ఇస్తారు. వందల పేజీల సమాచారాన్ని పరిశీలించి ఒక నిర్ణయానికి రావడానికి సమయం పడుతుంది. ఆ నివేదికను అర్థం చేసుకొని దానికి సమాధానం రాసుకోవడం బాధితులకు సాధ్యం కాదు. వారు బయట ప్రజా సంఘాల మద్దతు తీసుకుంటారు. ఆ తయారీ పూర్తి చేసుకొని బాధితులకు వివరించడానికి సమయం చాలదు. తమకు తెలిసిన సమాచారం మేరకు మాట్లాడుదామన్నా బాధితులను సమావేశానికి రానివ్వరు. జహీరాబాద్ పారిశ్రామిక వాడ కోసం లాక్ డౌన్ కాలంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం జరపాలని ప్రభుత్వం ప్రయత్నించింది. దాన్ని కోర్టు తప్పు పట్టింది. దాంతో సమావేశం వాయిదా పడింది. అయితే సమావేశం జరిగే రోజూ బాధితులు పాల్గొనటానికి పోలీసులు అనుమతించలేదు. ఎక్కడి వాళ్లను అక్కడ అరెస్టు చేసి సమావేశానికి రాకుండా చేశారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు విషయమై గట్ల కానిపర్తిలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ముఖ్య నాయకులను అరెస్టు చేశారు. మిగతా గ్రామస్తులు వారు విడుదల అయ్యే దాకా సమావేశం జరుగ కూడదని పట్టుబట్టడంతో అరెస్టయిన నాయకులు విడుదల అయ్యారు. అన్నీ సవ్యంగా జరిగినా ఏ నివేదికను ఢిల్లీకి పంపుతారో తెలియదు. ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వరు. అంతిమంగా అభివృద్ధిని అడ్డుకోరాదన్న అభిప్రాయానిదే పైచేయి అవుతున్నది. జహీరాబాద్ పారిశ్రామిక వాడ విషయంలో వ్యవసాయాన్ని పర్యావరణ అంశంగా చూడాలని జాతీయ పర్యావరణ సలహా మండలి చెప్పినా ఆ సూచనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

అనాగరిక భూసేకరణ పద్ధతులు

భూసేకరణ బలవంతంగా జరుగుతోంది. లావణి పట్టా పొందిన రైతులది ఇంకా అధ్వాన పరిస్థితి. చట్ట ప్రకారం ప్రభుత్వానికి అవసరమైనప్పుడు భూమి వెనుకకు తీసుకోవచ్చని బుకాయిస్తారు. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని  దున్నుకుంటున్నంత వరకు రైతు జోలికి వెళ్లకూడదు. పైగా పట్టాదారుకు ఎన్ని హక్కులు ఉంటాయో లావణి పట్టాదారుకు అన్ని హక్కులు ఉంటాయని సుప్రీం కోర్టు చాలా సార్లు చెప్పింది. ఈ తీర్పులను ప్రభుత్వం ఏమాత్రం గౌరవించడం లేదు. భూమి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే బలవంతంగా తీసుకోవచ్చని రూల్స్ చెప్పుతున్నాయని బుకాయిస్తోంది. ప్రభుత్వం లావణి పట్టా భూమిని వెనుకకు తీసుకుంటే వచ్చే పైసలు కూడా రావని బెదిరిస్తారు. దీంతో రైతులు భయపడి ఇచ్చిన పైసలకు సంతకాలు చేసి భూమిని ఇచ్చేస్తున్నారు. రైతులను విభజించడానికి చాలా చోట్ల రెవెన్యూ అధికారులు దళారులను తయారు చేస్తారు. వారి భూమికి ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఇతరుల పేరుమీద ఉన్న భూమిని వారి పేరు మీదికి మార్చి రైతులకు చెందాల్సిన పైసలను దళారులకు ఇప్పిస్తుంటారు. ఇట్లాంటి ఘటన షాబాద్ లో ఆధారాలతో సహా భూ బాధితులు బయట పెట్టారు. అయినా కలెక్టర్ ఏమీ చేయలేదు. దళారుల  సాయంతో గ్రామస్తులను తప్పు దోవ పట్టిస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చి, అబద్దాలను ప్రచారం చేసి భూ బాధితులను విడదీస్తారు. కొందరు సంతకం చేసి పైసలు తీసుకున్నట్టు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. భూమి ఇవ్వడానికి సంతకం చేస్తే మంచి పరిహారం ఇప్పిస్తామని ఆశ కల్పిస్తారు. అప్పటికీ వినక పోతే బెదిరిస్తారు. తప్పుడు పద్ధతుల్లో భూ సేకరణను వేగంగా పూర్తి చేసే అధికారులకు పేరు, గుర్తింపుతోపాటు అవసరమైన చోట పోస్టింగ్​ఇస్తారు. పోలీసుల్లో ఎనకౌంటర్ స్పెషలిస్టులు ఉన్నట్టే రెవెన్యూ శాఖలో బలవంతపు భూసేకరణ చేసే అధికారులున్నారు. “నేను మూడు ఊర్లు ఖాళీ చేయించిన వాడిని” అని గర్వంగా చెప్పుకునే వారూ ఉన్నారు. 2013 చట్ట ప్రకారం మార్కెట్ రేటును బట్టి రిజిస్ట్రేషన్ విలువను సవరించి దాని మీద మూడు రెట్లు పరిహారం చెల్లించాలి. ఎక్కడా ఈ పద్ధతిని గౌరవించడం లేదు. రైతులు కోర్టుకు పోయిన చోట మాత్రమే రేట్లను సవరించి మెరుగైన పరిహారం ఇస్తున్నారు. రెండు పంటలు పండే భూములను, సారవంతమైన సాగు యోగ్యమైన భూములను ఆహార భద్రత రీత్యా సేకరించ రాదు. పారిశ్రామిక వాడల కోసం సాగు భూమిని సేకరించ రాదని రూల్స్​ఉన్నాయి. సాగుకు పనికిరాని భూములనే పరిశ్రమలకు కేటాయించాలి.  రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని 5 సంవత్సరాల వరకు సేకరించిన లక్ష్యాల కోసం వాడకపోతే ఇచ్చిన నష్ట పరిహారంతో పాటు తీసుకున్న భూమిని యజమానులకు వదిలి పెట్టాలి. కానీ ఈ నియమాలను గౌరవించే దృక్పథం ప్రభుత్వానికి లేదు. 
తెలంగాణలో ఆనాడు చాకలి ఐలమ్మ, బందగీ వంటి పేద ప్రజల భూములను భూస్వాములు, దొరలు దౌర్జన్యంగా గుంజుకున్నట్టే ఇయ్యాల రాష్ట్ర సర్కారు అభివృద్ధి పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది. రైతుల జీవితానికి ఆధారమైన భూమిని అడ్డగోలుగా గుంజుకొని వారిని కూలీలుగా మారుస్తున్నది. నాయకుల, పలుకుబడి గల వ్యక్తుల, పెద్ద భూస్వాముల భూమి ఏ ప్రాజెక్టులో పోదు. అవసరమైతే అలైన్​మెంటు మారుతది. అదే సాధారణ బక్క రైతులు, పేద ప్రజల విషయంలో మాత్రం పోలీసులను పెట్టి మరీ భూమిని సేకరిస్తున్నరు. దీంతో పేదలు వనరులు కోల్పోతుండగా, ప్రభుత్వానికి దగ్గర ఉన్న పెద్దలు సంపన్నులవుతున్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటి సమానత్వపు హక్కును పక్కనబెట్టి గుప్పెడు మందికి లాభం చేసేలా రాష్ట్రంలో భూసేకరణ విధానం నడుస్తున్నది. ఈ అనాగరిక భూసేకరణ పద్ధతి పోవాల్సిన అవసరం ఉంది.
- ఎం.కోదండరామ్, అధ్యక్షులు, తెలంగాణ జన సమితి