బిస్తర్ సర్దేశారా?: మహారాష్ట్రలో కారు ఆగమాగం.. ఆఫీసులకు కిరాయిలు కడ్తలే

  • నిన్న ఆ రాష్ట్ర పార్టీ సమన్వయ కర్తల భేటీ
  • లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాం.. 
  • బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా..? లేదా..?
  • లేదంటే మా దారి మేం చూసుకుంటం
  • అధినేతకు మరాఠా లీడర్ల అల్టిమేటం

హైదరాబాద్: మహారాష్ట్రలో బీఆర్ఎస్ బిస్తర్ సర్దేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ స్టేట్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ సభలు నిర్వహించి మరాఠా ప్రజల అభిమానాన్ని చూరగొన్న కేసీఆర్ ఒక్కసారిగా ఎందుకలా మారిపోయారు. ఒక్క ఓటమికే ఎందుకంత కుంగిపోయారు? సారు ను నమ్ముకొని పార్టీలో చేరిన ఇతర పార్టీల లీడర్ల పరిస్థితి ఏమిటి..? లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గులాబీ బాస్ నోరు మెదపక పోవడంపై మరాఠా లీడర్లు గుర్రుగా ఉన్నారు.

నిన్న ఛత్రపతి సంభాజీనగర్(ఔరంగాబాద్)లో బీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర అధిపతి మాణిక్‌ కదమ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ మేరకు కేసీఆర్ కు ఘాటైన లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో  పోటీ చేస్తామా..? లేదా..? భవిష్యత్ కార్యాచరణ ఏమిటి..? లేదంటే మా దారి మేం చూసుకుంటామని లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల్లోగా స్పందించని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామంటూ అల్టిమేటం జారీ చేయడం విశేషం.

 కిరాయిలు కడ్తలేరు

మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఆఫీసులు తెరిచింది. తెలంగాణ ఎన్నికలు ముగిశాక ఇక్కడ 30 బహిరంగ సభల్లో పాల్గొంటానని కేసీఆర్ ఆ స్టేట్ లో జరిగిన బహిరంగ సభల్లో చెప్పారు. తెలంగాణ ఓటమి తర్వాత మహారాష్ట్ర విషయాన్నే మర్చిపోయారని మరాఠా లీడర్లు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఎలాంటి కార్యాచరణ లేదంటున్నారు. అప్పటి  నుంచి ఆఫీసుల కిరాయిలు కూడా కట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని..

అబ్కీ బార్ కిసాన సర్కార్ నినాదంతో మహారాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన కారు ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడంపై మరాఠా లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లోని 15 జిల్లాల్లో 27 పార్లమెంటరీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ సభ్యత్వ నమోదు ప్రారంభించిన బీఆర్ఎస్ లక్షా యాభై వేల మందిని పార్టీలో చేర్చుకుంది. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రైతు నాయకులు సైతం ఉన్నారు. వీళ్లంతా పార్టీ కోసం పనిచేశారు. పార్టీ సమన్వయ కర్తగా కేసీఆర్ తన అన్న కొడుకు కల్వకుంట్ల వంశీధర్ రావును నియమించారు.  

మహారాష్ట్ర వాసికి సీఎంవోలో కొలువు

పార్టీ విస్తరణలో భాగంగా గులాబీ కండువా కప్పుకొన్న అహ్మద్ నగర్ జిల్లాలోని నివ్ దుంగే అనే యువకుడికి తెలంగాణ సీఎంవోలో కొలువు ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. నెలకు 1.50 లక్షల జీతం ఇస్తూ ప్రైవేటు సెక్రటరీగా నియమించుకున్నారు. తన  పార్టీ విస్తరణకు  ప్రభుత్వాన్ని విస్తృతంగా వాడుకుంటున్నారనే విమర్శలు వచ్చినా కేసీఆర్ డోంట్ కేఆర్ అన్నారు. 

ఒక్క ఓటమికే కుంగిపోయారా?

తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపినట్టు చెప్పుకొంటున్న కేసీఆర్ ఒక్క ఓటమికే కుంగిపోయారా..? ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని భారీ సభలు పెట్టి మరాఠా నేతలపై సత్తా చాటాలని భావించిన గులాబీ బాస్ బిస్తర్ ఎందుకు సర్దేస్తున్నారు..? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.